కోవిడ్-19 టీకా నిల్వ, పంపిణీపై ప్లాన్ రూపొందించండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, ప్రయోగాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ సురక్షితంగా భద్రపరచడం సహా నిల్వ సామర్థ్యంపై సరైన ప్రణాళిక రూపొందించాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. వ్యాక్సిన్ ఒక్కసారి ఆమోదం పొందిన తర్వాత దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం సులభంగా చేరుతుంది. ‘కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా సమర్థవంతమైన రోగనిరోధకత కలిగిన టీకాల నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణకు భరోసా కోసం బలమైన విధానం అత్యవసరం’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు మానవ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఈ సంస్థతో కలిసి ఆస్ట్రాజెన్‌కా టీకా ఉత్పత్తి చేయనుంది. మరోవైపు, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన దేశీయ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకుంది. ‘కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణకు సిద్ధం చేయడంలో టీకా లాజిస్టిక్స్ కీలక పాత్ర పోషించనుంది. దీనివల్ల కేంద్రం, రాష్ట్రాలు ఇప్పటికే ఉన్న సామర్థ్యం, మౌలిక సదుపాయాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.. టీకాల డోస్‌ల కోసం ఉష్ణోగ్రతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.. వ్యాక్సిన్‌ను సమర్ధంగా పంపిణీ చేయడానికి అవసరమైన అదనపు వనరులను సమకూర్చోవాలని’ గ్లోబల్ హెల్త్, బయోఎథిక్స్, హెల్త్ పాలసీ పరిశోధకుడు డాక్టర్ అనంత్ భవన్ అన్నారు. ప్రణాళిక, సన్నాహాలు ఇప్పుడే ప్రారంభించాల్సి ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.
By October 02, 2020 at 07:07AM
No comments