Breaking News

వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం.. తీవ్ర గందరగోళం, ఇక లాంఛనమే


తీవ్ర గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు పెద్దల సభలో ఆమోదం లభించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ బిల్లులను ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా అవతరించనుంది. అటు ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 20) రాజ్యసభలో బిల్లులపై వాడీ వేడీ చర్చ జరిగింది. రాజ్యసభలో బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు నిరసన గళం వినిపించారు. అనంతరం గందరగోళం మధ్యే ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌‌తో పాటు ఇతర విపక్షాలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బిల్లులు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం జరిపే పంట సేకరణ విధానానికి ముగింపు పడుతుందని ఆరోపించాయి. టీఆర్‌ఎస్ వ్యతిరేకత.. వైఎస్సార్‌సీపీ మద్దతు వ్యవసాయ బిల్లులను టీఆర్‌ఎస్ పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని, ఈ బిల్లుల ద్వారా గిట్టుబాటు ధర దక్కుతుందని పేర్కొన్నారు. రైతులు వారికి నచ్చినచోట తమ ఉత్పత్తులను అమ్ముకోవడం వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు’, ‘ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ పేరుతో ప్రవేశ పెట్టిన ఈ బిల్లులను రాజ్యసభలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్, శిరోమణి అకాలీదళ్‌‌తో పాటు 14 పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఎన్డీఏకు తగినంత మద్దతు ఉండటంతో బిల్లులు ఆమోదం పొందాయి. సభలో తీవ్ర గందరగోళం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చారు. బిల్లుల ప్రతులను చించేసి డిప్యూటీ ఛైర్మన్‌పైకి విసిరేశారు. ఆయన వద్దకు దూసుకెళ్లి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బిల్లులపై పలు సందేహాలున్నాయని.. వాటికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని జేడీఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలేమిటో చెప్పాలని మాజీ ప్రధాని దేవెగౌడ కోరారు. ఆయన ఇవాళే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడం విశేషం. బిల్లులను ఆగమేఘాల మీద ప్రవేశ పెడుతున్నారని దేవెగౌడ విమర్శించారు. రైతుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి.. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ రాజ్యసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులు చరిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తాయని తెలిపారు.


By September 20, 2020 at 03:03PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/parliament-rajya-sabha-passes-two-farm-bills-amid-ruckus-by-opposition-mps/articleshow/78216153.cms

No comments