బ్రిటన్‌లో కరోనా రెండోదశ: కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే రూ.10 లక్షల వరకు ఫైన్!
మహమ్మారి రెండోసారి ఇంగ్లాండుపై పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కట్టడికి మరోసారి కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. తాజా నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే పదివేల పౌండ్ల (దాదాపు రూ.10లక్షలు) వరకు జరిమానా విధిస్తామని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా వైరస్ నిర్ధారణ అయిన వ్యక్తులు, వైరస్ లక్షణాలున్నవారు కచ్చితంగా పది నుంచి 14రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల వరకు జరిమానా విధిస్తామని, సెప్టెంబర్ 28 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని పేర్కొంది. దేశంలో రెండోసారి వైరస్ విజృంభణ మొదలైనట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల కిందటే వెల్లడించారు. వాయువ్య, ఉత్తర, మధ్య ఇంగ్లాండులో కఠిన ఆంక్షలు విధించారు. కోవిడ్ నిర్ధారణ అయిన లేదా టెస్టింగ్, ట్రేసింగ్‌లో భాగంగా ఆరోగ్య కేంద్రం సూచించిన వ్యక్తులు స్వీయ నిర్బంధంలో ఉండాలని, అలా కాకుండా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు యూరప్‌లో వైరస్ మళ్లీ విజృంభిస్తోందని బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు. వైరస్‌పై పోరులో భాగంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతిఒక్కరు నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఒక్కటే మార్గమని ప్రధాని స్పష్టంచేశారు. కొత్త నిబంధనల్లో భాగంగా ఆరుగురి కంటే ఎక్కువమంది ఒకచోట గుమిగూడి ఉండరాదనే నిబంధన విధించారు. నిబంధలను అతిక్రమిస్తే 1,000 పౌండ్ల నుంచి జరిమానా ప్రారంభమవుతుంది.. అంతర్జాతీయ ప్రయాణాల తరువాత క్వారంటైన్ ఉల్లంఘించినా, సిబ్బందిపై బెదిరింపుల పాల్పడే నేరాలు పునరావృతమయినా ఇది 10,000 పౌండ్లకు పెరుగుతుంది. అలాగే, క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఇంటి నుంచి పనిచేసే అవకాశం లేనివారికి 500 పౌండ్లు చెల్లిస్తారు. ‘చాలా మంది ప్రజలు నిబంధనలను పాటించటానికి సంపూర్ణంగా సహకరించినప్పుడు... ఐసోలేషన్‌లో ఉంటే ఆర్ధికంగా ఇబ్బంది పడతామని భావించే పరిస్థితి ఉండదని’ బోరిస్ జాన్సన్ అన్నారు. బ్రిటన్‌లో ఇప్పటివరకు 3.92 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. వీరిలో దాదాపు 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
By September 20, 2020 at 03:17PM
No comments