Breaking News

అసలైన విజేత.. వైకల్యాన్ని అధిగమించి ప్రతిష్టాత్మక ఐఐఎంలో సీటు!


కళ్లద్దాలు పెట్టుకొని ఫొటోకు పోజు ఇచ్చిన ఈ కుర్రాడి పేరు యష్ అవదీష్ గాంధీ. ఊరు ముంబై. ఇటీలే ఐఐఎం లక్నోలో సీటు సంపాదించాడు. అందులో పెద్ద విశేషం ఏముంది.. క్యాట్ రాసి మంచి మార్కులు తెచ్చుకున్న ఎవరైనా ఐఐఎంలో సీటు తెచ్చుకోవచ్చు కదా అంటారా..? నిజమే కానీ 21 ఏళ్ల ఈ యువకుడు.. ఈస్థాయికి రావడానికి ఎన్నో అవంతరాలను ఎదుర్కొన్నాడు. సెలబ్రల్ పల్సీ, డైస్లెక్సియా, డైసర్‌థ్రియా అనే శారీరక ఇబ్బందులతో యష్ ఇబ్బంది పడుతున్నాడు. వీటి బారిన పడిన వారిలో మాట్లాడటానికి ఉపయోగించే కండరాలను నియంత్రించడం కష్టం. దీంతో సరిగా మాట్లాడలేరు. డైస్లెకియా అనేది లెర్నింగ్ డిజార్డర్. దీంతో సాధారణ పిల్లలతో పోలిస్తే ఏదైనా త్వరగా నేర్చుకోలేడు. చిన్నతనం నుంచి ఇదే పరిస్థితి. దీంతో తల్లిదండ్రుల సాయంతో ఎక్కువ సేపు కష్టపడి.. కొద్ది రోజుల్లోనే పుంజుకున్నాడు. డిగ్రీ సెకండియర్ చదివే రోజుల్లోనే అంటే 2018లోనే క్యాట్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాడు. కానీ నంబర్స్‌తో ఇబ్బందులు పడ్డాడు. క్వాంటిటీవ్ ఎబిలిటీ సెక్షన్ బాగా ఇబ్బంది పెట్టింది. కానీ మొండి పట్టుదలతో నేర్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో క్యాట్ రాయడం తన వల్ల కాదనుకొని వదిలేద్దామనుకున్నాడు. కానీ నువ్వు ఏదైనా సాధించగలవురా కన్నా.. అని తల్లిదండ్రులు ధైర్యం నూరిపోశారు. కండరాల బలహీనత వల్ల తను రాయలేకపోయినా.. వేరే వ్యక్తి సాయంతో క్యాట్ రాసి 92.5 పర్సంటైల్ స్కోరు సాధించాడు. దీంతో ఐఐఎం బెంగళూరు మినహా అన్ని ఐఐఎంల నుంచి ఇంటర్యూలకు ఆహ్వానం అందింది. ఐఐఎం కోజికోడ్, ఐఐఎం ఇండోర్ నుంచి ఆఫర్ లెటర్లు వచ్చినప్పటికీ.. ర్యాంకింగ్‌లో మెరుగ్గా ఉండటంతో.. యష్ ఐఐఎం లక్నోను ఎంపిక చేసుకున్నాడు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోటాలో ఐఐఎంలో చేరిన యష్.. నెల రోజుల నుంచి ఇంట్లో ఉండే ఆన్‌లైన్ ద్వారా క్లాసులు వింటున్నాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేని ఏదీ లేదని చెప్పడానికి యష్ విజయమే ఓ నిదర్శనం.


By September 08, 2020 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/21-year-old-mumbai-youth-defies-all-odds-to-get-seat-in-iim-lucknow/articleshow/77991516.cms

No comments