Breaking News

అక్షరాస్యతలో అట్టడుగున ఆంధ్రా.. తెలంగాణ కాస్త నయం.. విస్తుగొలిపే వాస్తవాలు!


అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడ్డాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రా.. లిటరసీ రేటు విషయంలో మాత్రం అట్టడుగున నిలిచింది. తెలంగాణ కూడా జాతీయ సగటు కంటే వెనుకబడింది. 66.4 శాతం అక్షరాస్యతతో ఏపీ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. ఈ విషయంలో బిహార్ (70.9 శాతం) ఆంధ్రా కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. జాతీయ అక్షరాస్యత రేటు 77.7 శాతంగా ఉండగా.. తెలంగాణ అక్షరాస్యత రేటు 72.8 శాతంగా ఉంది. అసోం (85.9 శాతం) కంటే తెలంగాణ వెనుకంజలో ఉండటం వాస్తవికతకు అద్దం పడుతోంది. మన పొరుగున ఉన్న కర్ణాటక అక్షరాస్యత రేటు 77.2 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ అక్షరాస్యత రేటు 87.6 శాతంగా ఉండటం విశేషం. 2017-18కి గానూ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేసిన ఎడ్యుకేషన్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏడేళ్లు ఆ పైబడిన వారి వివరాల ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించారు. దీని ప్రకారం.. అక్షరాస్యతలో కేరళ 96.2 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండోస్థానంలో ఉంది. మన దేశంలో అక్షరాస్యత విషయంలో లింగ బేధం ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 84.7 శాతం ఉండగా.. మహిళల్లో 70.3 శాతంగా ఉంది. ఏపీలో స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత రేటులో అంతరం 13.9 శాతంగా ఉంది. అంటే ఆంధ్రాలో పురుషుల్లోనూ నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యత రేటులో అంతరం రాజస్థాన్‌‌లో 23.2 శాతం కాగా.. బిహార్‌లో 19.2 శాతం, యూపీలో 18.4 శాతంగా ఉంది. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు గ్రామీణ ప్రాంతాల కంటే 23.4 శాతం ఎక్కువగా ఉంది. ఏపీలో ఈ అంతరం 19.2 శాతంగా ఉంది. పట్టణాల్లోని పురుషుల అక్షరాస్యతతో రేటు.. గ్రామాల్లోని మహిళ అక్షరాస్యత రేటు మధ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో పట్టణాల్లోని పురుషుల అక్షరాస్యత రేటు 91.7 శాతం కాగా.. గ్రామాల్లోని మహిళ అక్షరాస్యత రేటు 53.7 శాతం మాత్రమే. దేశంలోని నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో మాత్రమే పట్టణాల్లోని పురుషుల అక్షరాస్యత రేటు 90 శాతం కంటే తక్కువగా ఉంది.


By September 07, 2020 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-66-percent-andhra-pradesh-literacy-rate-worst-in-india-telangana-well-below-the-national-average/articleshow/77970545.cms

No comments