కశ్మీర్: మినీ సెక్రటేరియట్ వద్ద సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రదాడి
కశ్మీర్‌లో భద్రతా బలగాలపై ముష్కర మూకలు మరోసారి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో మినీ సెక్రటేరియట్ వద్ద విధులు నిర్వహిస్తోన్న సీఆర్పీఎఫ్ దళాలే లక్ష్యంగా ఉగ్రవాదులు శుక్రవారం ఉదయం దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిలో ఇప్పటి వరకూ ఎంత మంది సైనికులు గాయపడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మినీ సెక్రటేరియట్‌ను చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు.. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, గురువారం ఉదయం బుద్గామ్‌లో ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడిన ఘటనలో సీఆర్పీఎఫ్‌కి చెందిన ఓ జవాన్ అమరుడయ్యాడు. చదూర వద్ద కైసెర్‌ముల్లా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మహారాష్ట్రకు చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ నరేశ్ ఉమారావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని 92 ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జవాను నరేశ్ కన్నుమూశారు. ఏఎస్ఐ పార్ధీవదేహాన్ని నాగ్‌పూర్‌లోని ఆయన స్వస్థలానికి తరలించిన అధికారులు.. శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త బాబర్ ఖాద్రీని ఉగ్రవాదులు గురువారం సాయంత్రం హత్యచేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇంటి వద్దే ముష్కరులు కాల్చిచంపారు.
By September 25, 2020 at 09:47AM
No comments