పశ్చిమ్ బెంగాల్, కేరళలో ఎన్ఐఏ దాడులు.. 9 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులు అరెస్ట్


రాజధాని ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేయడం కలకలం రేగుతోంది. పాకిస్థాన్ ప్రేరేపిత అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన మందిని అరెస్ట్ చేసినట్టు శనివారం తెలిపింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్, కేరళలోని ఎర్నాకుళం నగరాల్లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అల్‌ఖైదా సంస్థతో సంబంధాలున్న 9 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ముర్షిదాబాద్, ఎర్నాకుళం కేంద్రాలుగా పనిచేస్తున్నారని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ ప్రాంతాల్లో ఎన్ఐఏ పోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ముర్షిదాబాద్‌లో ఆరుగురు, ఎర్నాకుళంలో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అల్ ఖైదా ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తోంది. సోషల్ మీడియాలో పాకిస్థాన్‌కు చెందిన అల్‌ఖైదా ఉగ్రవాదుల ద్వారా ప్రేరణ పొందిన ఈ 9 మంది దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో దాడులకు కుట్రపన్నినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు, నిధులు సేకరించి, ఆయుధాలు, పేలుడు పదార్థాలు కొనుగోలుకు ఢిల్లీ వెళ్లాలని భావించారని పేర్కొంది. ‘టెర్రర్ మాడ్యూల్ నిధుల సేకరణలో చురుకుగా పాల్గొంటుంది.. కొంత మంది ముఠా సభ్యులు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సేకరించడానికి ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులకు ముందే వ్యూహరచన చేశారని తెలిపింది. అరెస్ట్ చేసినవారిని ముర్షీద్ హసన్, ఐయాకుబ్ బిశ్వాస్, మోసారఫ్ హోసన్ ఎర్నాకులానాకి చెందినవారు. నజ్మస్ సాకీబ్, అబు సుఫీయన్, మైనూల్ మోండల్, లే యాన్ అహ్మద్, అల్ మామున్ కమాల్, అతితూర్ రెహ్మాన్‌లు ముర్షిదాబాద్‌కు చెందిన వ్యక్తులు. నిందుతుల నుంచి భారీగా నాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిజిటల్ డివైజెస్, పలు డాక్యుమెంట్లు, ఉగ్రవాద సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, కస్టడీకి కోరునున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.


By September 19, 2020 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nia-busts-terror-module-in-west-bengal-kerala-arrests-9-operatives-with-incriminating-materials/articleshow/78199211.cms

No comments