గూఢచర్యం కేసులో ఢిల్లీ జర్నలిస్ట్: చైనాకు కీలక రహస్యాలు.. ప్రతిఫలంగా రూ.45 లక్షలు
దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు చేరవేస్తోన్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. డబ్బుకు ఆశపడి దేశ రహస్యాలను అందజేసిన రాజీవ్ శర్మ.. దీనికి ప్రతిఫలంగా రూ.45 లక్షల పొందినట్టు పోలీసులు తెలిపారు. రక్షణకు సంబంధించి కీలక పత్రాలు ఉన్నందున రాజీవ్‌శర్మను అధికార రహస్యాల చట్టం కింద సెప్టెంబరు 14న అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఓ చైనా మహిళ సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ‘భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చైనా నిఘా గూఢచార సంస్థలకు రాజీవ్ శర్మ చేరవేశాడని ఢిల్లీ ప్రత్యేక విభాగం డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు. 2016లో చైనా ఇంటెలిజెన్స్ అధికారి మైఖేల్ సంప్రదించగా, అతడికి భారత్‌కు సంబంధించిన కీలక సమాచారం అందజేశాడన్నారు. ఓసారి చైనాకూ వెళ్లొచ్చాడని, 2018 వరకూ ఈ వ్యవహారం కొనసాగిందని వివరించారు. దేశ రహస్యాలను ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఢిల్లీ నుంచి చైనాకు ఔషధాలను ఎగుమతిచేసే ఓ సంస్థ ద్వారా రాజీవ్ శర్మకు భారీ మొత్తంలో నగదు ముట్టిందని, ఏడాదిలో సుమారు రూ.40-45 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని తెలిపారు. దీంతో సదరు సంస్థ డైరెక్టర్లుగా ఉన్న చైనా మహిళ ఝంగ్ జీ, నేపాల్‌కు చెందిన షేర్ సింగ్ అకరాజ్ బోహరాను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దు వివాదం, అక్కడి ప్రస్తుత పరిస్థితులు, వాస్తవాధీన రేఖ వద్ద సైన్యం మోహరింపు, రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కీలక సమాచారం రాజీవ్ చేరవేసినట్టు డీసీపీ వెల్లడించారు. దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని సంజీవ్‌కుమార్ యాదవ్ తెలిపారు. అయితే, రాజీవ్‌శర్మ అరెస్ట్‌ను ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలోని ఏ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేయాలన్నా... ముందుగా తమ కౌన్సిల్‌కూ, బ్రాడ్‌కాస్ట్ మీడియా సెల్ఫ్ రెగ్యులేటరీ సంస్థకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఢిలీ పీఠంపురకు చెందిన రాజీవ్‌శర్మ 40 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన పలు మీడియా సంస్థల్లో పనిచేశారు. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు ఫ్రీలాన్సర్‌గానూ పలు కథనాలు రాశారు. సోషల్ మీడియాలో రాజీవ్‌శర్మ కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గతేడాది డిసెంబరులో ‘రాజీవ్ కిష్కింద’ పేరున యూట్యూబ్ ఛానల్‌ను ఆయన ప్రారంభించినట్లు తెలిపారు.
By September 20, 2020 at 10:37AM
No comments