Breaking News

మా అంతర్గత విషయాల్లో తలదూర్చడం మానుకో.. మందిరంపై పాక్ వ్యాాఖ్యలకు భారత్ కౌంటర్


అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంపై దాయాది పాక్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. మతపరంగా రెచ్చగొట్టే తీరును మానుకోవాలని, తమ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చడం మానుకోవాలని సూచించింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారత్ అంతర్గతమైన అంశంపై ఇస్లామిక్ రిపబ్లిక్‌ ఆఫ్ విడుదల చేసిన మీడియా ప్రకటనను గమనించాం.. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, మతపరంగా రెచ్చగొట్టే తీరుకు దూరంగా ఉండాలి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, స్వదేశానికి చెందిన మైనార్టీల మతపరమైన హక్కులను దూరం చేసే దేశం నుంచి వచ్చిన ఈ స్పందన ఆశ్చర్యపర్చలేదు. అయినా కూడా అలాంటి వ్యాఖ్యలు తీవ్ర విచారకరం’ అని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. అంతేకాదు, సివిల్ వివాదంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. తీవ్ర ఆత్రుతతో బాబ్రీ మసీదు స్థలంలో రామమందిర నిర్మాణం ప్రారంభించడం చూస్తే భారత్‌లో ముస్లింల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమవుతుందంటూ పాకిస్థాన్ విమర్శలు గుప్పించింది. ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసి భారత సుప్రీంకోర్టు దోషపూరిత తీర్పు న్యాయం మీద విశ్వాసం ప్రాముఖ్యతను ప్రతిబింబించడమే కాక, అక్కడ మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, వారి ప్రార్థనా స్థలాలపై పెరుగుతున్న దాడికి నిదర్శనమని వ్యాఖ్యానించింది.


By August 07, 2020 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-strong-reply-to-pakistan-comments-on-ayodhya-ram-mandir-construction/articleshow/77405424.cms

No comments