Breaking News

అసోం: బీజేపీ సీఎం అభ్యర్థిగా మాజీ సీజేఐ రంజన్ గొగొయ్.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు


వచ్చే అసోం శాసనసభ ఎన్నికల్లో తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ను నిర్ణయించనుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల జాబితాలో రంజన్ గొగొయ్ పేరున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఆయననే సీఎం అభ్యర్థిగా బీజేపీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందని అన్నారు. మాజీ సీజేఐ రాజ్యసభకు వెళ్లారు.. తరువాతి కాబోయే సీఎం అభ్యర్థిగా కూడా ఆయన అంగీకరించవచ్చని పేర్కొన్నారు. ‘అంతా రాజకీయం.. అయోధ్య బాబ్రీ మసీదు-రామమందిర వివాదంపై రంజన్ గొగొయ్ తీర్పుతో బీజేపీ సంతోషంగా ఉంది.. ఆయన క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.. రాజ్యసభ సభ్యత్వాన్ని అంగీకరించారు.. రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన ఎందుకు నిరాకరించలేదు? సులభంగా మానవ హక్కుల కమిషన్ లేదా ఇతర హక్కుల సంస్థలకు ఛైర్మన్ కావచ్చు. అతనికి రాజకీయ ఆశయం ఉంది, అందుకే ఆయన నామినేషన్‌ను అంగీకరించారు’ అని తరుణ్ గొగొయ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని కాదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) సలహాదారుగా, సమన్వయ కర్తగా వ్యవహరిస్తానని అన్నారు. కూటమి తరఫున సీఎంగా ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. అయితే, ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడటాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల ఎగువ అసోంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని వాదిస్తున్నారు.


By August 23, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-cji-ranjan-gogoi-may-be-bjps-assam-cm-candidate-congress-leadeer-tarun-gogoi/articleshow/77700127.cms

No comments