Breaking News

రామమందిర భూమిపూజ లైవ్ అప్‌డేట్స్: కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న ప్రధాని


అయోధ్యలోని రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరారు. ఆయన కాసేపట్లో అయోధ్య చేరుకుంటారు. మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకుంటారు. 12.30 గంటల నుంచి 12.45 వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. భూమి పూజకు ముందు పారిజాత మొక్కను నాటతారు. ఉగ్రవాదులు బెదిరింపుల నేపథ్యంలో పటిష్ట భద్రత కల్పించారు. 45 ఏళ్లలోపు ఉండి కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య-నేపాల్‌ సరిహద్దు బస్తీ డివిజన్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై భద్రతా బలగాలు నిఘా పెంచాయి. ప్రపంచం మొత్తం దృష్టి భారత్‌వైపే ఉంది. సామరస్యం సందేశాన్ని పంపడానికి ఇది చారిత్రాత్మక రోజు అని ఈ కార్యక్రమానికి హాజరైన స్వామి అవధేశానంద్ గిరి అన్నారు. ‘రాముడు అందరివాడు. ఆయన అందరి క్షేమాన్ని కోరుకున్నాడు. కొన్ని యుగాలుగా ఆ మహత్తర వ్యక్తిత్వం భారత ఉపఖండాన్ని ఒక్కటిగా ఉంచేందుకు దోహదం చేసింది. కేవలం భారతదేశమే కాదు మొత్తం ప్రపంచంపై ‘రామాయణం’ చెరగని ముద్ర వేసింది’ అని కాంగ్రెస్‌ నేత ప్రియాంక వాద్రా వ్యాఖ్యానించారు. అయోధ్యలో తలపెట్టిన రామ మందిర శంకుస్థాపన జాతీయ సమైక్యత, సోదరభావానికి, సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె ఆకాంక్షించారు.


By August 05, 2020 at 11:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ram-janmabhoomi-ayodhya-ram-mandir-bhumi-pujan-live-updates-in-tlugu/articleshow/77365425.cms

No comments