Breaking News

దేశంలో కోవిడ్ కొత్త రికార్డు: జులైలోనే 11లక్షలకుపైగా కేసులు, 20వేల మరణాలు


కోవిడ్ మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం తగ్గడంలేదు. శుక్రవారం దేశవ్యాప్తంగా 57వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. మరో 764 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16.97 లక్షలకు చేరగా.. 36,551 మంది ఇప్పటి వరకూ చనిపోయారు. ఒక్క జులై నెలలోనే 11.1 లక్షల పాజిటివ్ కేసులు, 19,122 మరణాలు నమోదయ్యాయి. జూన్ నెలలో 4 లక్షల కేసులు నమోదు కాగా.. 11,988 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ నెలతో పోలిస్తే జులైలో పాజిటివ్ కేసులు 2.8 రెట్లు అధికంగా నమోదుకావడం గమనార్హం. జూన్‌తో పోల్చితే జులైలో కరోనా మరణాలు 1.6 రెట్లు అధికంగా చోటుచేసుకున్నాయి. జులై నెల ప్రథమార్ధంలో 3.8 లక్షల మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ద్వితీయార్ధంలో ఏకంగా 7.3 లక్షల కేసులు బయటపడ్డాయి. అలాగే, ద్వితీయార్ధంలోనే 11,600 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం దేశంలో 57,464 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. వరుసగా నాలుగో రోజు కోవిడ్ కేసులు 50వేలకుపైగా నమోదయ్యాయి. అలాగే, మరణాలు కూడా వరుసగా నాలుగో రోజు 750కిపైగా సంభవించాయి. శుక్రవారం నాటి కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి తొలిస్థానంలో నిలిచింది. ఏపీలో 10,376 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 10,320 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రను మించి పాజిటివ్ కేసులు ఏపీలో నమోదుకావడం ఇది మూడోసారి. శుక్రవారం నాటి కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 1.4 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని వెనక్కు నెట్టింది. మహారాష్ట్ర (4.2 లక్షలు), తమిళనాడు (2.5 లక్షలు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరప్రదేశ్ (4,453), బీహార్ (2,986), బెంగాల్ (2,496), అసోం (2,112), తెలంగాణ (1,986), కేరళ (1,310), పంజాబ్ (665)లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా.. గత 10 రోజులుగా మాత్రం వరుసగా కేసులు పెరుగుతున్నాయి. జులైన 20న 1,198 కేసులు నమోదవగా.. 30న ఏకంగా 1,986 పాజిటివ్‌లను నిర్ధారించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 62,703కు పెరిగింది.


By August 01, 2020 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-57000-cases-on-friday-as-july-count-tops-11-lakh-in-india/articleshow/77296043.cms

No comments