Breaking News

మైనర్ హత్యాచార ఘటనపై బెంగాల్‌లో నిరసనలు.. బస్సులు, పోలీసుల వాహనాలకు నిప్పు


పశ్చిమ్ బెంగాల్‌లో మైనర్ బాలిక హత్యాచార ఘటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతా-సిలిగురి జాతీయ రహదారిపైకి వచ్చి నిరసన తెలిపిన ఆందోళనకారులు.. వాహనాలకు నిప్పంటించారు. రహదారిని దిగ్బంధించి పలు వాహనాలకు నిప్పంటించడంతో పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా హింసకు దారితీయగా, మూడు బస్సులు, పోలీసుల వాహనాలను తగులబెట్టారు. తొలుత ఆందోళనకారులు చెదరగొట్టడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారని పోలీసులు భావించారు. అయితే, జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న రోడ్డుపైకి చేరి పోలీసులపై విల్లు, బాణాలతో దాడిచేశారు. దాదాపు రెండు గంటల పాటు పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోల్‌కతాకు 500 కిలోమీటర్ల దూరంలోని చోప్రా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. చోప్రా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అనుమానస్పద రీతిలో చనిపోయింది. హతురాలి సోదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలే బాలిక పదో తరగతి పాసయ్యింది. శనివారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆమె కోసం కుటుంబం వెదుకుతుండగా ఓ చెట్టు కింద విగతజీవిగా పడి ఉంది. ఆ పక్కనే రెండు బైక్‌లు, మొబైల్ ఫోన్లు ఉన్నాయని, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్యచేసి ఉంటారని గ్రామస్థులు ఆరోపించారు. బాలిక మృతదేహంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాలికపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడి, హత్యచేశారని, దీనికి బాధ్యులైనవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం విషం తాగి బాలిక చనిపోయిందని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో జరిగిన ఈ పోస్ట్‌మార్టం మొత్తం వీడియోలో చిత్రీకరించామని తెలిపారు. విషం వల్లే బాలిక చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసిందన్నారు.


By July 20, 2020 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-vehicles-set-on-fire-in-bengal-after-alleged-gang-rape-murder-of-student/articleshow/77058853.cms

No comments