Breaking News

కరోనాను కట్టడి చేయలేకపోతే క్యాబినెట్ రద్దు చేస్తా.. కజకిస్థాన్ అధ్యక్షుడు వార్నింగ్!


మహమ్మారిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్, షట్‌డౌన్‌లే ప్రధాన ఆయుధమని అన్ని దేశాలూ భావిస్తున్నాయి. భౌతికదూరం పాటించడం, ప్రజల కదలికలను తగ్గించగలిగితే కరోనా వ్యాప్తిని అదుపులోకి తెవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. తాజాగా, కజకిస్థాన్‌లో రెండో విడత లాక్‌డౌన్ జులై 5 నుంచి అమలవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ తగ్గకపోతే క్యాబినెట్‌ను రద్దు చేస్తానంటూ దేశాధ్యక్షుడు కాసిమ్ జోమార్ టొకయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండో విడత లాక్‌డౌన్ రెండు వారాల పాటు కొనసాగుతుందని, దేశంలో కరోనా నిర్మూలన బాధ్యత మంత్రులపైనే ఉందని టొకేయేవ్ స్పష్టం చేశారు. రెండు సార్లు లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా పరిస్థితుల్లో మార్పు రాకపోతే ప్రభుత్వ సమర్థతపై సందేహాలు వస్తాయని, క్యాబినెట్ కూర్పుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని వ్యాఖ్యానించారు. అంతేకాదు, మార్చి-మే నెలలో లాక్‌డౌన్ కారణంగా సేవల రంగం దెబ్బతినడంతోపాటు కీలకమైన చమురు, గ్యాస్ ధరల తగ్గుదలతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది జనవరి- జూన్ వరకు 1.8 శాతంగా కుదించిన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయాలని టోకాయేవ్ స్పష్టం చేశారు. కోవిడ్-19 కట్టడికి అదనంగా మరో 150 బిలియన్ టెంజ్ (363 మిలియన్ డాలర్లు)‌లు కేటాయించాలని సూచించారు. అంతేకాదు, ఈ ఏడాది 9 నుంచి 11 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణాన్ని 8 నుంచి 8.5 శాతానికి తగ్గించాలని కేంద్ర బ్యాంకును కోరారు. కాగా, కజకిస్థాన్‌లో ఇప్పటి వరకు దాదాపు 55 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం అత్యధికంగా 1,962, శుక్రవారం 1,726 పాజిటివ్ కేసులు రావడంతో అక్కడి ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది.


By July 11, 2020 at 09:47AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/kazakh-president-kassym-jomart-tokayev-threatens-to-sack-cabinet-if-covid-19-efforts-fail/articleshow/76904374.cms

No comments