Breaking News

రాముడిపై ప్రధాని వ్యాఖ్యలు: స్వదేశంలోనే విమర్శలు.. నేపాల్ దిద్దుబాటు చర్యలు


శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్య నేపాల్‌లోనే ఉందని, ఆయన భారతీయుడు కాదంటూ ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలి చేసిన వ్యాఖ్యలపై భారత్‌లోనే కాదు సొంత దేశంలోనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఓలి హద్దుమీరి వ్యాఖ్యలు చేశారని, ఇలాంటి అతివాదం సమస్యలనే సృష్టిస్తుందని మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ దుయ్యబట్టారు. అంతేకాదు, ఇప్పుడు ఓలి కొత్తగా కలియుగ రామాయణాన్ని వినిపిస్తారేమోనని ాయన ఎద్దేవా చేశారు. భారత్‌-నేపాల్‌ సంబంధాలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఓలి ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేసినట్లు ఉందని మాజీ విదేశాంగ మంత్రి కమల్‌ థాపా అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓలీ చేసిన వ్యాఖ్యల వల్ల నేపాల్‌లోనూ, అటు దేశం బయటా వివాదం ఏర్పడిందని, రామభక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలను వెంటనే ఓలీ ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌ సీనియర్‌ నేత బామ్‌దేవ్‌ గౌతమ్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు రాముడి జన్మస్థానమైన అయోధ్య ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ నేతలు కూడా ఓలీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పందిస్తూ.. నేపాల్‌ ఒకప్పుడు ఆర్యుల పాలనలో అంతర్భాగం అనే విషయం ఓలి తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై పెను దుమారం రేగడంతో నేపాల్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఓలీ వ్యాఖ్యల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం లేదని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాఖ్యలు అయోధ్య ప్రాముఖ్యతను, దానికి కలిగి ఉన్న సాంస్కృతిక విలువను తగ్గించడానికి కాదని పేర్కొంది. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని బిబహ పంచమి పేరుతో జనక్‌పూర్‌లో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతుందని తెలిపింది. అయోధ్య-జనక్‌పూర్ మధ్య రామాయణ సర్క్యూట్ పేరుతో 2018 మేలో భారత్, నేపాల్ ప్రధానులిద్దరూ రైలు సర్వీసులు ప్రారంభించిన విషయాన్ని గుర్తిచేసింది. ఇది భారత్, నేపాల్ మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక సంబంధాలకు దక్కిన గౌరవమని వివరించింది. భారత్‌లో కాలాపానీ, లిపులేక్, లింపుయాధురాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ తీసుకొచ్చిన మ్యాప్‌తో ఇరు దేశాల మధ్య చిచ్చు రేగింది. అప్పటి నుంచి భారత్, నేపాల్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. నేపాల్ చర్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. చరిత్రలను వక్రీకరించవద్దని హితబోధ చేసింది. ఇదే సమయంలో ప్రధాని ఓలీపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోవాలని మాజీ ప్రధాని ప్రచండ నాయకత్వంలోని అసమ్మతి వర్గం డిమాండ్ చేస్తోంది.


By July 15, 2020 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/nepal-in-damage-control-after-pm-controversial-claim-that-lord-rama-was-born-in-our-country/articleshow/76970861.cms

No comments