Breaking News

నేడు అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సుప్రీం కీలక తీర్పు


కేరళలోని శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయ మేనేజ్‌మెంట్ వివాదంపై సోమవారం తీర్పును వెలువరించనుంది. జస్టిస్ యు.యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్ కోర్ రాజవంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు గతేడాది ఏప్రిల్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజవంశం.. తమకే హక్కులు ఉంటాయని వాదిస్తోంది. కాగా, 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపదలు వెలుగుచూశాయి. అంతులేని సంపదతో ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఐదు నేలమాళిగలలో కంటే ఆరోగదిలో ఇంతకంటే ఎక్కువ సంపద ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆరో నేలమాళిగ తెరవకూడదని దానికి నాగబంధం ఉందని భక్తులు, ట్రావెన్ కోర్ వంశీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆరోనేల మాళిగను తెరవడానికి సిద్ధమైన సందర్భంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆరో గదిని తాము ఆదేశించే వరకు తెరవకూడదని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్‌కోర్ రాజులు సంరక్షకులుగా ఉండేవారు. వారి కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేని సంపద వచ్చి చేరిందని చెబుతారు. ఆ సంపద పరిరక్షణ ఉపయోగం, న్యాయ బద్ధంగా న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న ట్రావెన్ కోర్ రాజ వంశీయులకు అప్పగిస్తారా? ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. డచ్, బ్రిటిషర్లు, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ట్రావెన్ కోర్ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18వ శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో భద్రపరిచారు. అదే 2011లో బయటపడిన బంగారు గని.


By July 13, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-to-verdict-on-anantha-padmanabha-swamy-temple-issue-today/articleshow/76932268.cms

No comments