పశ్చిమ్ బెంగాల్: ఇంటికి సమీపంలో ఉరేసుకుని బీజేపీ ఎమ్మెల్యే మృతి
పశ్చిమ్ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. హెమటాబాద్ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ తన స్వగ్రామానికి సమీపంలో ఉరేసుకుని చనిపోయారు. అయితే, ఆయనను తొలుత హత్యచేసి, తర్వాత ఉరేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే వాదన చేస్తున్నారు. ఎమ్మెల్యేను హత్యచేసి తర్వాత ఉరి బిగించారని అంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మృతికి కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాయ్‌గంజ్ ఆస్పత్రికి తరలించారు. ‘ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని హెమటాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్.. తన స్వగ్రామంలోని సమీపంలో ఇంటి వద్ద ఉరేసుకున్నట్టు గుర్తించారు.. అయితే, ఆయనను తొలుత హత్యచేసి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు చిత్రీకరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. 2019లో బీజేపీలో చేరడమే ఆయన చేసిన తప్పా’ అంటూ బీజేపీ విభాగం ట్వీట్ చేసింది. ఇక, 2016 ఎన్నికల్లో హెమటాబాద్ రిజ్వర్ స్థానం నుంచి సీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయిన దేవేంద్ర నాథ్ రాయ్ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. దేవేంద్ర నాథ్ రాయ్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ హస్తముందని, రాయ్‌ను తొలుత హత్యచేసి, ఆత్మహత్యగా నమ్మించడానికి ఉరికి వేళాడదీశారని, సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని బీజేపీ నేత రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా... ఎమ్మెల్యే అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగుతోంది.
By July 13, 2020 at 10:19AM
No comments