కుల్‌భూషణ్ జాదవ్ కేసులో పాక్ సంచలన నిర్ణయం.. ఐసీజే తీర్పు అమలకు ప్రయత్నం!
చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో గత రెండు రోజుల నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులు ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించిన పాకిస్థాన్.. జాదవ్‌కు న్యాయవాదిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. న్యాయ విచారణ కోసం (ఐసీజే) ఆదేశాలను అమలు చేయడానికి పాక్ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. పిటిషన్‌ను దాఖలు చేసిన న్యాయ మంత్రిత్వ శాఖ.. అంతర్జాతీయ కోర్టు తీర్పు ప్రకారం మిలిటరీ కోర్టు నిర్ణయాన్ని సమీక్షించడానికి ఒక న్యాయవాదిని పొందాలని కోరినట్టు పేర్కొంది. ఇటీవలే కుల్‌భూషణ్ కేసులో మూడో కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడానికి పాక్ ముందుకొచ్చింది. అంతకు ముందు, రెండో కాన్సులర్ యాక్సెస్ తరువాత అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. అడ్డంకులు, అవాంతరాలు లేకుండా బేషరతుగా జాదవ్‌ను కలిసేందుకు అవకాశం కల్పించలేదని ఆరోపించింది. అంతేకాదు జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కూడా పేర్కొంది. మరోవైపు, కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం 2019లో ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి పాక్ ప్రభుత్వ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు గురువారం జాతీయ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సభ నుంచి వాకౌట్ చేయడానికి ముందు ఈ అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అర్డినెన్స్ ద్వారా భారత పౌరుడికి ఎన్‌ఆర్ఓ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన ప్రతిపక్షం ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రభుత్వం మరోసారి ఆశ్రయించాలని సూచించింది. ఎన్ఆర్ఓ అనేది జాతీయ సయోధ్య ఉత్తర్వులను సూచిస్తుంది.. దీని కింద బెనజీర్ భుట్టో సహా పలువురు నేతలు దేశ బహిష్కరణ తర్వాత స్వదేశానికి తిరిగి రాగలిగారు. చట్టపరమైన ప్రక్రియ నుంచి తప్పించుకోడానికి వీలు కల్పించే ఈ పదాన్ని ఇప్పుడు పాక్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్నారు. ‘మన దేశంలో ఉగ్రవాదానికి పాల్పడినట్లు అంగీకరించిన ఓ ఉగ్రవాదిపై చట్టపరమైన చర్యలను పూర్తి చేశారు. ఇప్పుడు అతడికి అవకాశం కల్పించేందుకు అధికారికంగా శాసనం అమలు చేస్తున్నాం’ అని పిఎంఎల్-ఎన్ నేత, పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జాదవ్ విషయంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం భారత్‌ను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తోందని ఇప్పటి పాలక పక్షం ఆరోపించింది.. మరి ఈ రోజు భారత్‌ను ఎవరు ప్రసన్నం చేసుకుంటున్నారు?’ అని ఆసిఫ్ నిలదీశారు. ఈ ఆర్డినెన్స్ జాతీయ గౌరవానికి వ్యతిరేకంగా ఉన్నందున దీనిని అనుమతించవద్దని సభ్యులను కోరారు.
By July 24, 2020 at 09:48AM
No comments