దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పాజిటివ్ కేసుల్లో ఆదివారం కొత్త రికార్డ్
దేశంలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం ఏకంగా 29వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. గడచిన మూడు రోజులతో పోలిస్తే మరణాలు సంఖ్య కాస్త తగ్గింది. ఆదివారం 492 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 8,79,060కి చేరుకోగా.. 23,175 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా నుంచి 5.54 లక్షల మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 3.02 లక్షలు దాటింది. దేశంలో యాక్టివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జూన్ 1 నాటికి ఈ కేసులు లక్షకు చేరగా.. తర్వాత 23 రోజుల్లోనే 2 లక్షలకు చేరాయి. అయితే, అప్పటి నుంచి కేవలం 15 రోజుల్లోనే మూడు లక్షలకు చేరుకోవడం గమనార్హం. ఆదివారం దేశవ్యాప్తంగా 29,272 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో శనివారం నాటి కేసుల రికార్డును అధిగమించింది. దేశంలో కరోనా మరణాల రేటు 2.6 శాతంగా నమోదయ్యింది. ఇక, రోజువారీ కరోనా కేసుల్లో దక్షిణాదిలో ఆదివారం కొత్త రికార్డు నమోదయ్యింది. తొలిసారి పాజిటివ్ కేసులు 10వేల మార్క్ దాటడం విశేషం. కర్ణాటకలో 2,627, ఆంధ్రప్రదేశ్‌లో 1,933 కొత్త కేసులు బయటపడ్డాయి. మిగతా రాష్ట్రాల్లోనూ రికార్డుస్థాయిలో కేసులు నిర్ధారణ కావడం గమనార్హం. పశ్చిమ్ బెంగాల్ (1,560), బీహార్ (1,266), గుజరాత్ (879), చత్తీస్‌గఢ్ (184)కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకూ ఒక్క రోజులో ఈ సంఖ్య కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. బీహార్‌లో తొలిసారి కేసులు 1,000 మార్క్ దాటాయి. దీంతో పాజిటివ్ కేసులు ఒక్క రోజే 1,000 నమోదయిన 10వ రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఇక, రోజువారీ కేసుల్లో మహారాష్ట్ర ఎప్పటిలాగే తొలిస్థానంలోనే నిలిచింది. అక్కడ అత్యధికంగా 7,827 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 103,516కి చేరాయి. అలాగే మొత్తం కేసులు 2.5 లక్షల మార్క్ దాటింది. ఆదివారం మరో 173 మంది ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు 10,289కి చేరాయి. ఢిల్లీలో 1,573 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రారంభంలో 2,505 కేసులు నమోదుకాగా.. వారాంతానికి ఇది గణనీయంగా తగ్గింది. కర్ణాటకలో కేసులు భారీగా నమోదుకావడమే కాదు, మరణాలు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు నగరంలో ఆదివారం 1,525 కేసులు నమోదు కాగా.. మరో 45 మంది చనిపోయారు. తమిళనాడులో 4,244 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఏపీలో 2వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 10.86 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం 1,933 మంది దీని బారిన పడగా, 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజులో ఈ స్థాయిలో కేసులు, మరణాలు సంభవించటం ఇదే తొలిసారి. మొత్తం కేసుల సంఖ్య 29,168కు, మరణాలు 328కు చేరాయి. తెలంగాణలో ఆదివారం 1,269 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 34,671కి పెరిగింది. 11,883 మంది చికిత్స పొందుతుండగా 1563 మంది కోలుకున్నారు. మరో 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 356కు చేరింది. ఆదివారం నిర్ధారణ అయిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్)లో 800 కేసులు ఉన్నాయి.
By July 13, 2020 at 07:24AM
No comments