Breaking News

మైనార్టీలో గెహ్లాట్ ప్రభుత్వం.. 30 ఎమ్మెల్యేలు నా వెంటన్నారు: సచిన్ పైలట్


ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదిరి పాకానపడింది. ముఖ్యమంత్రి , డిప్యూటీ సీఎం మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇన్ని రోజులు మౌనంగా ఉన్న సచిన్ పైలట్.. ముఖ్యమంత్రిపై బాహటంగా విమర్శలకు దిగారు. రాష్ట్రంలో మైనార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం కష్టమంటూ బాంబు పేల్చారు. సోమవారం ఉదయం శాసనసభా పక్షం సమావేశం జరగనుండగా పైలట్ చేసిన వ్యాఖ్యలతో రాజస్థాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. గెహ్లాట్ విశ్వాసం కోల్పోయారని, తనకు 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొంత మంది స్వతంత్రుల మద్దతు ఉందని ప్రకటించారు. తాను శాసనసభా పక్ష సమావేశానికి హాజరు కాబోనని స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన సచిన్ పైలట్.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాను కలిసినట్టు వార్తలు వెలువడిన వెంటనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరైన ఆధారాలు లేకపోయినప్పటికి పైలట్ తిరుగుబాటు వెనుక బీజేపీ పాత్ర ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం జరిగే సీఎల్‌పీ సమావేశానికి ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరవుతారో, గెహ్లాట్ ఏమాత్రం పట్టునిలుపుకుంటారో తేలిపోనుంది. బీజేపీకి సంబంధించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్ పైలట్‌కు నోటీసులు ఇవ్వడంతో ఆయన దీనికి ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఉగ్రవాద వ్యతిరేక లేదా వ్యవస్థీకృత నేరాలపై విచారణ జరిపే ప్రత్యేక బృందానికి అప్పగించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, బేరసారాలకు తెరతీసిందని సీఎం గెహ్లాట్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీలో బసచేయగా.. వారిలో ముగ్గురు యువ ఎమ్మెల్యేలు డానిష్ అబ్రార్, రోహిత్ బోహ్రా, చేతన్ దూడిలు జైపూర్‌కు తిరిగొచ్చి, గెహ్లాట్‌కు మద్దతు తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలు మనేసర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.


By July 13, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sachin-pilot-revolts-says-gehlot-govt-in-minority-dy-cm-claims-support-of-30-mlas/articleshow/76931473.cms

No comments