మోదీ చేసే పనులు నచ్చట్లేదు : తెలుగు సింగర్
తెలుగు లేడీ సింగర్ స్మిత గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈమె ఒక సింగర్‌గానే కాదు రాజకీయ పరంగా కూడా తన ట్విట్టర్ వేదికగా అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. అప్పట్లో టీడీపీకి అనుకూలంగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఏదో ట్వీట్ చేయగా దానిపై వైసీపీ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ప్రధాని మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే.. ఎన్నికల్లో మోదీకి అనుకూలంగా అడుగులేసిన స్మిత ఇప్పుడు ఆయన పాలనపై తనకు అసంతృప్తిగా ఉందని చెప్పేసింది.
ఇందుకేనేమో!?..
వాస్తవానికి తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా స్మిత చెప్పేస్తుంటుంది. మోదీ చేసే పనులు నచ్చట్లేదని నిక్కచ్చిగా చెప్పేసింది. ఇచ్చిన వాగ్ధానాలను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించింది. అంతేకాదు.. మోదీపై పెట్టుకున్న ఒక్క ఆశ కూడా నెరవేరలేదని చెప్పుకొచ్చింది. కాగా రాష్ట్ర విభజనాంతరం ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ముఖ్యంగా ‘ప్రత్యేక హోదా’ ఇస్తామని తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పి చేతులెత్తేసిన విషయం విదితమే. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ చేసే పనులు నచ్చట్లేదని స్మిత చెప్పిందేమో.!
రాజకీయాల్లోకి వస్తారా..!?
కాగా.. ఇదే ఇంటర్వ్యూలో తన కులం గురించి కొందరు పదే పదే అడుగుతుండేవారని డిగ్రీ పూర్తయ్యే వరకూ కులం అంటే ఏంటో తెలియదని చెప్పుకొచ్చింది. అయినా నోరెత్తితే కులం తప్ప వేరొకటి ఉండదా..? అని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీపై కూడా స్మిత స్పందించింది. ‘రాజకీయాల్లోకి వచ్చేందుకు నాకు ఎలాంటి ఆసక్తి లేదు. ఏదైనా పార్టీలో ప్రత్యక్షంగా చేరితే మన సొంత నిర్ణయాలను అమలు చేయలేం. అందుకే ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనిపిస్తే ఆ పార్టీ వైపు నడవాలనేది నా అభిప్రాయం.అంతకుమించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని నాకు లేదు’ అని స్మిత చెప్పుకొచ్చింది.
By July 29, 2020 at 03:12PM
No comments