Breaking News

శ్రీలంకలో పెరుగుతున్న చైనా ప్రాబల్యం.. తెరపైకి సేతుసముద్రం ప్రాజెక్టు


హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్న చైనా.. శ్రీలంకలోనూ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది దక్షిణ తీరంలో భద్రతకు ముప్పుగా పరిణమించిందని, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సేతు సముద్రం ప్రాజెక్టును పునః ప్రారంభించాలని కోరుతూ ప్రధానికి డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత లేఖ రాశారు. సరిహద్దుల్లో చైనా ఏర్పడిన ఉద్రిక్తతలపై ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయంలో కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా పూర్తిగా మద్దతు ఉంటుందని తమ పార్టీ అధినేత స్టాలిన్ తెలిపిన అంశాన్ని గుర్తుచేశారు. దక్షిణ చైనా సముద్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో అండమాన్ నికోబార్ దీవులలో భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి కేంద్రం సమాయత్తవుతోంది. ఈ నేపథ్యంలో సేతు సముద్రం ప్రాజెక్టుపై డీఎంకే ఎంపీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు సుదీర్ఘ తీరంలో కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.. ముఖ్యంగా శ్రీలంకలో చైనా భారీ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలి.. ఆ దేశం రుణాలను ఎగవేసిన తర్వాత అక్కడ హంబన్‌టోటా పోర్టును స్వాధీనం చేసుకుంది’ అని ప్రధానికి రాసిన లేఖలో బాలు పేర్కొన్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత దక్షిణ తీరంలో భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా సేతుసముద్రం ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించిన బాలూ.. ఈ ప్రాజెక్టు పనులు 2005 జులైలో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో దీనికి మతం రంగు పులిమి కొన్ని శక్తుల అడ్డుకున్నాయని అన్నారు. భారతీయ ఓడరేవులకు వచ్చే 65 శాతం నౌకలు ఈ కాలువను ఉపయోగిస్తాయి కాబట్టి సేతు సముద్రం ప్రాజెక్ట్ ముఖ్యమైంది. అంతేకాదు ‘ఆడమ్స్ వంతెన (రామసేతు)’కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. ‘దేశ భద్రత కోసం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా, 2024లో పొంగల్ పండుగ (జనవరి) సందర్భంగా తొలి ఓడ కాలువ గుండా ప్రయాణించేలా దీనిని పరిశీలించి తిరిగి పనులు ప్రారంభించాలని అభ్యర్థిస్తున్నాను’ అని బాలు తన లేఖలో రాశారు.


By July 11, 2020 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dmk-leader-tr-baalu-urges-pm-modi-to-reactivate-stalled-sethusamudram-canal-project/articleshow/76903464.cms

No comments