Breaking News

క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.. తొలి దశలో వెయ్యి మందిపై ప్రయోగం: ఐసీఎంఆర్


ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించడానికి సాధ్యమైనంత త్వరగా దేశీయ వ్యాక్సిన్ తీసుకురావాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూ.. వ్యాక్సిన్ తయారీ సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌, జైడస్ కాడిలా తయారు చేసిన మరో వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులిచ్చింది. తాజాగా దీనిపై భారత వైద్య పరిశోధన మండలి () స్పందించింది. దేశంలో మానవులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని వెల్లడించింది. ఓ వ్యాక్సిన్ తయారీకి అత్యంత కీలకంగా భావించే ఈ ప్రక్రియలో దాదాపు 1000 మంది వలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపింది. దీనిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్‌ల ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి.. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి ఫాస్ట్-ట్రాక్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయాల్సిన నైతిక బాధ్యత మనపై ఉందని అన్నారు. ప్రస్తుతం రెండు స్వదేశీ వ్యాక్సిన్‌లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ఎలుకలు, కుందేళ్లపై ఈ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కాగా.. దీనికి సంబంధించిన నివేదికను డిసీజీఐకి సమర్పించారు.. దీని తరువాత ఈ నెల ప్రారంభంలో మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అనుమతి లభించిందని భార్గవ చెప్పారు. ‘రెండు సంస్థలు తమ సైట్‌లను సిద్ధం చేసుకున్నాయి..వివిధ సైట్‌లలో సుమారు 1,000 మంది వలంటీర్ల క్లినికల్ ట్రయల్స్‌కి సిద్ధంగా ఉన్నారు.. స్వదేశీ వ్యాక్సిన్ సంస్థలు ప్రారంభ క్లినికల్ టెస్టింగ్‌కు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ప్రపంచంలో 60 శాతం వ్యాక్సిన్లు ఆఫ్రికా, యూరప్, ఆగ్నేయాసియాలో తయారవుతున్నా.. వీరిలో భారత సంతతికి చెందినవారే ఉంటున్నారని అన్నారు. వ్యాక్సిన్‌ల సరఫరాలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రెండు దశల్లో జరిగే ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ లో కరోనా వ్యాక్సిన్ కోసం అనేక పరిశోధనలు జరిగినా, ఇప్పటివరకు భారత్ బయోటెక్, జైడస్ కాడిలా మాత్రమే ఆశించిన మేర ఫలితాలు సాధించాయి. దీంతో ఈ రెండు వ్యాక్సిన్‌ల క్లినికల్ ట్రయల్స్‌ రెండు దశలకు అనుమతి ఇచ్చారు.


By July 15, 2020 at 09:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/human-clinical-trials-for-covid-19-vaccine-initiated-in-india-says-icmr/articleshow/76971893.cms

No comments