పేస్‌బుక్ ప్రేమ: పాక్‌లోని లవర్‌ను కలిసేందుకు మహారాష్ట్ర యువకుడు సాహసం
పాకిస్థాన్‌లో ఉన్న ప్రియురాలిని కలవడానికి గుజరాత్ వద్ద సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన భారత్‌కు చెందిన యువకుడిని సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ యువకుడిని మహారాష్ట్రలోని ఉస్మాన్‌బాద్ పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిషాన్ మహ్మద్ సిద్ధిఖిగా గుర్తించారు. గురువారం రాత్రి రాన్ ఆఫ్ కచ్ వద్దకు చేరిన సిద్దిఖీ.. బైక్ సాయంతో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించి బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ పరిక్షీత్ రాథోడ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పాక్ యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందని, దీంతో ఆమెను కలిసేందుకు సరిహద్దులు దాటే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. పాకిస్థాన్ సరిహద్దులోకి చేరగానే అతడి ద్విచక్రవాహనం ఇసుకలో కూరుకుపోవడాన్ని గమనించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జులై 11న ఇంటి నుంచి వచ్చేసి ప్రియురాలిని కలవడానికి పాకిస్థాన్‌కు బయలుదేరినట్టు తెలిపారు. తొలుత సైకిల్‌పై ఉస్మాన్‌బాద్ నుంచి అహ్మద్‌నగర్‌కు 225 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత అక్కడ నుంచి బైక్‌తో మిగతా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి, సరిహద్దు దాటడానికి ప్రయత్నించి బీఎస్ఎఫ్ జవాన్లకు చిక్కాడు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ సిద్ధిఖీ తల్లిదండ్రులు ఉస్మాన్‌బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ఆధారంగా గుజరాత్ నుంచి ఆ యువకుడిని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. అలహాబాద్ నుంచి ఉస్మాన్‌బాద్‌కు వచ్చిన సిద్ధిఖీ కుటుంబం అక్కడే స్థిరపడింది. తండ్రి మౌలానా విధులు నిర్వర్తిస్తుండగా.. తల్లి చీరల వ్యాపారం చేస్తుంది. జులై 11న ఉదయ 9.30 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఛార్జర్ పనిచేయడంలేదని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.. కొత్త ఛార్జర్ కొనడానికి వెళ్లుంటాడని అనుకున్నామని సిద్దిఖీ తండ్రి తెలిపారు. తర్వాత ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చిందన్నారు. అర్ధరాత్రి వరకు లాప్‌టాప్‌లో గంటల తరబడి చాటింగ్ చేయడంతో తమకు అనుమానం వచ్చిందన్నారు. అతడు ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత అనుమానం వచ్చిన దానిని పోలీసుల వద్దకు తీసుకెళ్లి సైబర్ నిపుణుల సాయంతో ఓపెన్ చేసి చూడగా.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్న విషయం గుర్తించామని తెలిపారు. ఆమె నుంచి ఫోన్ రావడంతోనే కలవడానికి వెళ్లినట్టు నిర్దారణకు వచ్చామన్నారు. ‘జులై 16న రాత్రి 9 గంటల ప్రాంతంలో సరిహద్దు దాటుతూ ఇసుకలో బైక్ కూరుకుపోగా.. అతడి సొమ్మసిల్లి పడిపోయాడు. అతడిని గమనించిన బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకోగా.. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు.. పాన్, ఏటీఎం, ఆధార్ కార్డు, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని, మెలకువ వచ్చిన తర్వాత ప్రశ్నించగా.. కరాచీకి చెందిన యువతితో ఫేస్‌బుక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పాడు.. గూగుల్ మ్యాప్ సాయంతో పాక్ వెళ్లేందుకు ప్రయత్నించాడు’ అని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
By July 18, 2020 at 10:41AM
No comments