Breaking News

అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధికంగా కరోనా పరీక్షలు.. వైట్‌హౌస్ ప్రకటన


ప్రపంచంలో అత్యధికంగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నట్టు అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. తొలి స్థానంలో అమెరికా ఉన్నట్లు మరోసారి ప్రకటించింది. ఇప్పటివరకు అమెరికాలో 4కోట్ల 20లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. అమెరికా తరువాత అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలను భారత్‌ చేపడుతున్నట్లు అభిప్రాయపడింది. భారత్‌లో ఇప్పటి వరకు కోటి 20లక్షల మందికి పరీక్షలు పూర్తిచేసినట్టు వైట్‌హౌస్ ప్రెస్‌ సెక్రటరీ కెలీగ్‌ మెక్‌ఎనాని మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అమెరికా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నట్లు మెక్‌ఎనాని పునరుద్ఘాటించారు. ఇదివరకు హెచ్1ఎన్1 ఫ్లూ విజృంభించిన సమయంలో గత ప్రభుత్వాలు అవలంభించినట్లుగా తాము ఈ టెస్టింగ్‌లను ఆపబోమని స్పష్టం చేశారు. బారక్ ఒబామా హయాంలో 2009లో హెచ్1ఎన్1 వైరస్ ఉద్ధృతమైనప్పుడు పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్రాలకు ఆదేశించారని ఆమె ఆరోపించారు. మెక్‌ఎనాని చేసిన ఆరోపణలను మాజీ ఉపాధ్యక్షుడు బొడెన్ స్టాఫ్ చీఫ్ రోన్ క్లెయిన్ తిప్పికొట్టారు. ‘హెచ్1ఎన్1 అమెరికా చరిత్రలో సామూహిక ప్రమాద సంఘటనలో ఒకటి కాకపోవడం అదృష్టం.. నాటి పరిస్థితిని కరోనాతో పోల్చడానికి సంబంధం లేదు’ అన్నారు. మరోవైపు, దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గత కొద్ది రోజుల నుంచి నిత్యం దాదాపు 3లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 3,60,228 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,66,72,718 కొవిడ్‌ పరీక్షలు పూర్తిచేసినట్లు భారత్‌ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. కరోనా కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 37,70,012 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా లక్షా 42వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 10.40 లక్షలు దాటగా మరణాల సంఖ్య 26వేలు దాటింది.


By July 18, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-us-india-has-done-most-covid-19-tests-says-white-house/articleshow/77029967.cms

No comments