Breaking News

ఆలయం అడుగున టైమ్ క్యాప్సూల్ నిక్షిప్తం చేయడంలేదు.. రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్


అయోధ్యలో నిర్మించనున్న రామమందిరానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అయితే, ఆలయ ప్రాంగణంలో 2 వందల అడుగుల లోతులో రాగి రేకుతో రూపొందించిన కాలనాళిక (టైమ్‌ క్యాప్సూల్‌)ను నిక్షిప్తం చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, ప్రచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తోసిపుచ్చింది. రెండు రోజులుగా మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం లేదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ మంగళవారం స్పష్టం చేశారు. ‘రామమందిర అడుగు భాగంలో టైమ్ క్యాప్యూల్‌ను నిక్షిప్తం చేస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని, వీటిని నమ్మొద్దు’ అని చంపత్‌రాయ్ తెలిపారు. భవిష్యత్తుల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఆలయ అడుగున రెండు వందల అడుగుల లోతున టైమ్ క్యాప్యూల్స్ ఏర్పాటుచేయనున్నట్టు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ సోమవారం ప్రకటించారు. శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే భాగంలోనే దీనిని నిక్షిప్తం చేయనున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు, తామ్ర రేకులపై సంస్కృతంలో రాసిన అయోధ్య, రాముడి జీవిత చరిత్రను కూడా నిక్షిప్తం చేయనున్నామని అన్నారు. అయితే, రాగి పలకలపై సంస్కృతంలో మాత్రమే ఎందుకు చెక్కారు అని ప్రశ్నించగా.. చాలా తక్కువ పదాలలో దీర్ఘ వాక్యాలను వ్రాయగల భాష అని అన్నారు. సుదీర్ఘకాలం కోర్టు విచారణ సహా రామజన్మభూమి కోసం పోరాటం ప్రస్తుత, రాబోయే తరాలకు పాఠంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఎవరైనా ఆలయ చరిత్రను అధ్యయనం చేయాలనుకుంటే, రామ జన్మభూమికి సంబంధించిన వాస్తవాలను టైమ్ క్యాప్సూల్ నుంచి పొందడం వల్ల కొత్త వివాదాలు తలెత్తవు అని చౌపాల్ అన్నారు. రామాలయ భూమి పూజ కోసం వెండి, ఇతర లోహాలతో చేసిన ఇటుకలను విరాళంగా పంపించడాన్ని నిలిపివేయాలని రామమందిర ట్రస్టు భక్తులకు విజ్ఞప్తి చేసింది. లోహ ఇటుకలకు బదులుగా నగదు రూపంలో విరాళాలను బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సూచించింది.


By July 29, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-temple-trust-says-no-time-capsule-to-be-placed-below-ayodhya-temple/articleshow/77233388.cms

No comments