Breaking News

పశ్చిమ్ బెంగాల్‌లో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు


దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జులై 31 వరకు వారంలో రెండు రోజుల పాటు పాటిస్తున్న లాక్‌డౌన్‌ను మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని సీఎం వెల్లడించారు. అయితే, ఆగస్టు 1న బక్రీద్‌ పండుగ, ఆగస్టు 9న ప్రపంచ గిరిజన దినోత్సవం కావడంతో ఆ రోజుల్లో లాక్‌డౌన్‌ ఉండదని స్పష్టం చేశారు. బెంగాల్‌లో లాక్‌డౌన్‌ దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి వెళ్లిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను ప్రస్తుతం భువనేశ్వర్‌లో నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇది భువనేశ్వర్‌ నుంచి బయలుదేరనుంది. బుధవారం కోల్‌కతా నుంచి బయలుదేరాల్సిన దురంతో ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో నిన్న ఒక్క రోజే 2,134 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 62,964కి పెరిగింది. వీరిలో 42,0227మంది కోలుకొని ఇంటికి వెళ్లగా.. 1449 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 19,493 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ‘రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి తేదీలను ప్రకటించిన తరువాత, పండుగలు, ముఖ్యమైన సందర్భాలలో మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటోంది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తాము ఆగస్టు 1, ఆగస్టు 9న పూర్తి లాక్‌డౌన్‌‌ను ఉపసంహరించుకుంటున్నాం’ అని బెంగాల్ హోం శాఖ తెలిపింది. అయితే, కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బైవీక్లీ లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రజా, ప్రయివేట్ రవాణా పూర్తిగా నిలిచిపోతాయని తెలిపింది. కేవలం అత్యవసర సర్వీసులు, పెట్రోల్ బంకులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ విమాన సర్వీసులను కూడా నిలిపివేస్తున్నట్టు వివరించింది.


By July 29, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-biweekly-lockdown-extended-till-august-31st-to-curb-covid-19/articleshow/77233934.cms

No comments