ఈ ఏడాదికి చివరికి ఆక్స్‌ఫర్డ్ టీకా.. ఆగస్టు నుంచి భారత్‌లో క్లినికల్ ట్రయల్స్
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్, చికిత్స విధానంపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ఆరంభించాయి. ఆస్ట్రజెన్‌కా- ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, మోడెర్నా వంటి విదేశీ సంస్థలు తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేశాయి. ఆక్స్‌ఫర్డ్ మూడో దశ ప్రయోగాలు వచ్చె నెలలో మొదలుకాబోతున్నాయి. అభివృద్ధిలో భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ‘ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై పనిచేస్తున్నాం. వచ్చే నెలలో భారత్‌లో సైతం మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తాం. ప్రస్తుత పరిస్థితులు, ప్రయోగాత్మక పరీక్షల ఫలితాలను చూస్తే.. ఏడాది చివరికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’ అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అడార్ పూనావాలా పేర్కొన్నారు. అమెరికాకు చెందిన కొడాజెనిక్స్ బయోటెక్‌తో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రాజెనెకా, కొడాజెనిక్స్‌లతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఆస్ట్రియాకు చెందిన ధెమిస్, మరో రెండు సంస్థలు ఇందులో ఉన్నాయని పూనావాలా అన్నారు. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్‌ను 100 కోట్ల డోసుల ఉత్పత్తి, సరఫరా నిమిత్తం ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌లు భారత్‌తో పాటు తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తొలి దశ ఫలితాలను సోమవారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఫలితాలను లాన్సెంట్ మెడికల్ జర్నల్‌లో జులై 20న వెల్లడించే అవకాశం ఉందని మీడియా పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ రూపొందించిన వ్యాక్సిన్‌తో కరోనా వైరస్ నుంచి ‘రెట్టింపు రక్షణ’ లభిస్తుందని మానవులపై నిర్వహించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్ల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించిన శాస్త్రవేత్తలు.. యాంటీ బాడీలతోపాటు వైరస్ హంతక ‘టి కణాల’ను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. శరీరాన్ని ఈ టీకా ప్రేరేపిస్తున్నట్లు ఈ నమూనాలు చెబుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
By July 20, 2020 at 11:51AM
No comments