రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని బీఎస్పీ ఎమ్యెల్యేలకు విప్ జారీ
సోమవారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బీఎస్పీ విప్ జారీచేసింది. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ, వారంతా ఎన్నికల్లో బీఎస్పీ తరఫున గెలుపొందడంతో ప్రస్తుతం పార్టీ విప్ జారీ చేయడం సాంకేతిక సమస్యలకు దారితీస్తుంది. కాగా, ఈ అంశంపై రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఎలక్షన్ కమిషన్‌కు బీఎస్పీ అధినేత్రి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగుర్నీ తమ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలని మాయావతి కోరగా.. స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఈసీ తిరస్కరించింది. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో మరోసారి వీరికి బీఎస్పీ విప్ జారీచేసింది. ‘ఆరుగురు ఎమ్మెల్యేలకు వేర్వేరుగా, సమిష్టిగా నోటీసులు జారీ చేశాం.. బీఎస్పీ ఒక జాతీయ పార్టీ కాబట్టి, జాతీయస్థాయిలో విలీనం అయితే తప్ప తమ సభ్యులు రాష్ట్ర స్థాయిలో విలీనం కుదురదని, వారు దీనిని ఉల్లంఘిస్తే అనర్హులు అవుతారు’అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. మరోవైపు, శాసనసభను జులై 31న సమావేశపరచాలని కోరుతూ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు సీఎం గెహ్లాట్ ప్రతిపాదనలు పంపారు. కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించడానికి సభను సమావేశపరచాలని కోరారు. ఇంతకు ముందు గెహ్లాట్ పంపిన ప్రతిపాదనలపై ఎలాంటి కారణాలు, తేదీ పేర్కొనలేదని గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
By July 27, 2020 at 11:41AM
No comments