Breaking News

డ్రాగన్‌కు మరో ఝలక్.. పబ్జీ, షియోమి జిలి సహా 47 చైనా యాప్‌లపై నిషేధం!


సరిహద్దుల్లో రెచ్చిపోతున్న డ్రాగన్‌కు బుద్ధిచెప్పడానికి సామబేధ దండోపాయాలను భారత్ ప్రయోగిస్తోంది. ఓవైపు చర్చలు జరుపుతూనే, ఇంకోవైపు ఎటువంటి దుస్సాహసం చేసినా దీటుగా బదులిస్తామని సంకేతాలు పంపుతోంది. మరోవైపు, పొరుగు దేశాన్ని దారిలోకి తెచ్చుకునేందుకు దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్‌లో ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌ సహా 59 ప్రధాన మొబైల్‌ యాప్‌లను ఇప్పటికే నిషేధించింది. తాజాగా, మరో 47 యాప్‌లను ఆ జాబితాలో చేర్చింది. ఈ నిషేధిత యాప్‌‌ల వివరాలను కేంద్రం త్వరలోనే వెల్లడించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. మొత్తం 275 యాప్‌లనూ నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లు అర్థమవుతోంది. యాప్‌ల నిషేధం తమని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. నిషేధానికి గురైన కొన్ని సంస్థలు తమ కార్యకలాపాల్ని చైనా వెలుపలకు తరలించేందకు కూడా సిద్ధమయ్యాయి. అవసరమైతే చైనాతో ఉన్న ఒప్పందాల్ని, ఇతర సంబంధాల్ని కూడా తెంచుకోవాలని భావిస్తున్నాయి. యాప్‌లను నిషేధించి చైనాకు ఊహించని ఝలక్ ఇచ్చిన కేంద్రం మరిన్ని యాప్‌లనూ నిషేధించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను గుర్తించే పనిలో పడింది. పబ్‌జీ సహా 250కిపైగా యాప్‌లు కేంద్రం జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై ఇప్పటికే కేంద్ర నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా యాప్‌ల ద్వారా డేటా ఎలా మారుతుందో సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే 20 యాప్‌ల ద్వారా జరుగుతున్న డేటా ట్రాన్స్‌ఫర్‌ను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అవసరమైతే చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లపై వేటు వేసే యోచనలో కేంద్రం ఉందని తెలిపాయి. వినియోగదారుల గోప్యత లేదా జాతీయ భద్రతా ఉల్లంఘనలకు పాల్పడిన అనుమానిత యాప్‌ల జాబితాను భారత్ సిద్ధం చేసింది. వీటి సంఖ్య 250 వరకు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజా, జాబితాలో పబ్‌‌జీ వంటి గేమింగ్ యాప్స్ ఉన్నట్టు వివరించాయి.


By July 27, 2020 at 12:13PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-bans-another-47-chinese-apps-over-270-more-under-scanner-for-privacy-violation/articleshow/77192723.cms

No comments