Breaking News

చైనాకు మరో ఝలక్ ఇచ్చిన భారత్.. ఈసారి దౌత్యపరంగా దెబ్బ!


సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వరుసగా చైనాకు షాకులిస్తోంది. చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి తొలి షాక్ ఇచ్చిన భారత్.. హైవే ప్రాజెక్టుల్లో చైనా సంస్థలకు అనుమతులు నిరాకరించనున్నట్లు తెలిపింది. తాజాగా డ్రాగన్‌కు మరో ఝలక్ కూడా ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయంపత్రిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసినప్పుడు పాకిస్థాన్ గగ్గోలు పెట్టగా... దానికి చైనా వంతపాడిన సంగతి తెలిసిందే కదా. అసలు గాల్వన్‌లో ఘర్షణలకు దిగడానికి కూడా ఇదే బలమైన కారణం అనే వాదన కూడా ఉంది. ఇదే చైనా విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలిసిందే. తాజాగా హాంకాంగ్ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది. డ్రాగన్ చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తుండగా.. భారత్ మాత్రం ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. కానీ హాంకాంగ్‌ విషయంలో భారత్ తొలిసారిగా స్పందించింది. జెనీవాలోని మానవ హక్కుల సంఘంలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. హాంకాంగ్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని ప్రకటించింది. ‘ఈ పరిణామాలపై వ్యక్తమవుతున్న అనేక అభ్యంతరాలను వింటున్నాం. ఈ విషయంలో సంబంధిత పార్టీలు తగిన రీతిలో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ చందెర్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన చైనా పేరును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. హాంకాంగ్‌‌ కొత్త చట్టం విషయంలో చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని 27 దేశాలు సూచించాయి. 4 క్వాడ్ దేశాల్లో అమెరికా ముందుగా స్పందించగా.. జపాన్, ఆస్ట్రేలియా కూడా చైనా చర్యను వ్యతిరేకించాయి. దీంతో చివరకు భారత్ కూడా చైనా తీరుపట్ల స్పందించింది. 1997 వరకు హాంకాంగ్‌ బ్రిటిషర్ల అధీనంలో ఉంది. తర్వాత చైనా చేతిలోకి వెళ్లింది. హాంకాంగ్‌లో వేర్పాటు వాదం, విదేశీ జోక్యాన్ని నివారించే పేరిట అక్కడి ప్రజల స్వేచ్ఛను హరించడం చైనా ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినవారు, ఆదేశాలను ధిక్కరించిన వారు శిక్షార్హులు.


By July 02, 2020 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/india-gives-diplomatic-punch-to-china-on-new-hong-kong-security-law/articleshow/76743800.cms

No comments