చదువు పేరిట వ్యభిచార కూపంలోకి.. ఆరేళ్ల తర్వాత అనూహ్య రీతిలో విముక్తి
అమ్మానాన్నను కోల్పోయిన ఓ అమ్మాయికి అన్నీ తానై చూసుకుంటానని.. చదువు చెప్పించి ప్రయోజకురాలని చేస్తానని ఓ కిలేడీ మాయమాటలు చెప్పింది. నిజమేననుకొని వెంట వెళ్లిన ఆ అమ్మాయిని వ్యభిచార గృహానికి విక్రయించి సొమ్ము చేసుకుంది. ఆరేళ్ల తర్వాత ఆ అమ్మాయి వ్యభిచార చెర నుంచి బయటపడింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ అమ్మాయి తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆమెను చదివిస్తానని.. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని బంధువులకు చెప్పిన ఓ మాయలేడీ.. తనతోపాటు తీసుకెళ్లింది. కోటి ఆశలతో తనతో వచ్చిన ఆ అమ్మాయిని వేశ్యా గృహానికి విక్రయించింది. ఆరేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆమె ఆచూకీ కోసం మేనమామ, బంధువులు గాలిస్తున్నారు. బెల్లంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్నారు. కానీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాగా సోమవారం ఆ అమ్మాయి మేనమామకు ఓ వ్యక్తి ఫోన్ చేసి కీలక సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన పోలీసులకు ఈ విషయం చెప్పాడు. దీంతో సిరిసిల్లలోని ప్రేమ్ నగర్‌లో ఉన్న వ్యభిచార గృహం నుంచి ఆ అమ్మాయిని విడిపించి ఆమె మేనమామకు అప్పగించారు. జరిగింది చెప్పిన ఆ యువతి భోరున విలపించింది.
By July 29, 2020 at 05:42AM
No comments