చైనా కొత్త ఎత్తుగడ.. భూటాన్‌ను బెదిరించి భారత్‌పై ఒత్తిడికి ప్రయత్నం
సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. డ్రాగన్ మరో కొత్త పన్నాగానికి తెరతీసింది. భూటాన్ భూభాగంలోని ఓ ప్రాంతం తమదేనంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన చైనా.. ఆ దేశాన్ని సరిహద్దు ఒప్పందంలోకి తీసుకురావడం ద్వారా భారత్‌పై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘చైనా-భూటాన్ మధ్య ఇప్పటి వరకూ సరిహద్దులు నిర్ణయించలేదు, తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వివాదం కొనసాగుతోంది.. ఇందులో మూడో వ్యక్తి (భారత్) జోక్యం చేసుకోరాదని హెచ్చరిస్తున్నాం’అని చైనా విదేశాంగ శాఖ శనివారం ఓ ప్రకటన చేసింది. తూర్పు ప్రాంతంలో ఉన్న సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యం గురించి ప్రపంచ పర్యావరణ సౌకర్యాల కౌన్సిల్‌కు జూన్ 29న భూటాన్ దరఖాస్తు చేయడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది వివాదాస్పద ప్రాంతమని వాదిస్తోంది. భూటాన్ నిధులను అందుకున్నా.. చైనా అభ్యంతరం బెదిరించే ప్రయత్నంగా ఉంది.. ఎందుకంటే తూర్పు భూటాన్‌పై సరిహద్దు వాదనలు చైనా తొలిసారి తెరపైకి తెచ్చింది. ఈ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన భూటాన్.. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి గట్టిగా సమాధానం ఇచ్చింది. ‘సాక్టెంగ్ వన్యప్రాణి అభయారణ్యం భూటాన్ సమగ్ర, సార్వభౌమ భూభాగం’ అని స్పష్టం చేసింది. సాక్టెంగ్ అభయారణ్యం భూటాన్‌లోని ట్రాషిగాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. భారత్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహాలలో భాగంగా చైనా, దేశానికి సాన్నిహిత్యంగా ఉన్న పొరుగుదేశాలపై డ్రాగన్ బెదిరింపులకు పాల్పడుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సరిగ్గా మూడేళ్ల కిందట 2017లో డోక్లాంలోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడగా.. భారత్ దీనిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాదాపు 72 రోజుల పాటు ఇరు సైన్యాల మధ్య ప్రతిష్టంభణ కొనసాగింది. తర్వాత చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. డోక్లాం మాదిరిగానే ప్రస్తుతం కూడా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో చైనా నిర్మాణాలు చేపట్టినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. భారత్‌లోని సిలిగురి కారిడార్‌ను లక్ష్యంగా చేసుకుని, టోర్సా / అమో చు వెంట చైనా మరో రహదారిని నిర్మించడం ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి.
By July 06, 2020 at 11:04AM
No comments