భారత్-చైనా మధ్య ఘర్షణ పెరిగితే ట్రంప్ గోడమీద పిల్లేనా?.. మాజీ సలహాదారు ఏమన్నారంటే?
ఇటీవల సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య తలెత్తిన ఘర్షణలు పెరిగి పరిస్థితి చేజారితే.. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా ఎవరి పక్షాన నిలుస్తాయనే అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వియాన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్-చైనా మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరితే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌వైపు ఉంటారన్న నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు. తూర్పున, దక్షిణ చైనా సముద్రం, జపాన్, భారత్ వంటి పొరుగు దేశాలతో ఉద్దేశపూర్వకంగానే వివాదాలను రేపుతూ, కయ్యానికి చైనా కాలుదువ్వుతోందని మండిపడ్డారు. ఇటీవల కాలంలో పొరుగుదేశాలతో డ్రాగన్‌కు సంబంధాలు క్షీణించాయన్నారు. చైనా విషయంలో భారత్‌కు మద్దతుగా నిలిచే విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారని అడిగిన ప్రశ్నకు బోల్టన్ సమాధానం ఇస్తూ...‘ఈ విషయంలో ఆయన (ట్రంప్) ఏమార్గంలో వెళతారన్న విషయం నాకు తెలియదు. నాకు తెలిసీ ఆయనకు కూడా దీనిపై అవగాహన ఉందనుకోను.. చైనాతో సంబంధాల విషయంలో ఆయన వాణిజ్యం వంటి భౌగోళిక వ్యూహాత్మక అంశాల్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత ఆయన ఏం చేస్తారన్నది చెప్పలేం.. చైనాతో మళ్లీ ఓ భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్-చైనా మధ్య వివాదం ముదిరితే ఆయన ఎటువైపు మొగ్గుచూపుతారన్నది నేను కచ్చితంగా చెప్పలేను’ అని అభిప్రాయపడ్డారు. అంటే భారత్-చైనా మధ్య ఉద్రిక్తత పెరిగితే, ట్రంప్ భారత్‌కు మద్దతిస్తారన్న నమ్మకం మీకు లేదా? అని ప్రశ్నించగా.. ‘అవును.. అది నిజం’ అని బోల్టన్ బదులిచ్చారు. దశాబ్దాలుగా భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలపై ట్రంప్‌నకు అవగాహన లేదని తాను భావిస్తున్నట్లు బోల్టన్ అభిప్రాయపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు అడ్డంకిగా మారే ప్రతి అంశాన్ని పక్కన పెట్టడమే రాబోయే నాలుగు నెలల్లో ట్రంప్ చేయబోయే పని అని వ్యాఖ్యానించారు. కాబట్టి, భారత్-చైనా మధ్య ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోరాదని ట్రంప్ కోరుకుంటారని బోల్టన్ అన్నారు. ట్రంప్ కోరుకుంటున్నది చైనా లేదా భారత్‌కు ప్రయోజనం చేకూరుస్తుందా అనేది కాదని, ఆయన దృక్కోణంలో ఏదీ శుభవార్త కాదన్నారు. ఓవైపు సరిహద్దుల్లో భారత్- చైనాలు తమ సైన్యాలను వెనక్కు మళ్లిస్తున్నాయి. మరోవైపు, పలు దేశాలు భారత్‌కే మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ తరుణంలో బోల్టన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. బోల్టన్ 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబరు వరకు ట్రంప్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు.
By July 12, 2020 at 11:50AM
No comments