Breaking News

యూపీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు క్రిమినల్స్‌ను హతమార్చిన పోలీసులు


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రౌడీ షీటర్లు దాడికి పాల్పడిన ఘటనలో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో కనీసం ముగ్గురు క్రిమినల్స్‌ను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ముగ్గుర్నీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులుగా భావిస్తున్నారు. అయితే, వికాస్ దూబే అక్కడ నుంచి తప్పించుకోగలిగాడని నివేదిక పేర్కొంది. జులై 3న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిథూర్ దిక్రూ గ్రామంలోని గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఇంటిపై పోలీసులు దాడిచేశారు. ఇప్పటికే 60 కేసులు అతడిపై నమోదై ఉండగా.. తాజాగా, ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో మొత్తం మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసుల బృందాలు అక్కడకు చేరుకోగా.. అప్పటికే దూబే తన అనుచరులను సిద్దం చేశాడు. మారణాయుధాలు, తుపాకులతో పోలీసులను చుట్టుముట్టి, రోడ్డుకు అడ్డంగా జేసీబీని ఉంచాడు. పోలీసులు వచ్చిన మార్గాన్ని మూసేసి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డీఎస్పీ దేవేందర్ మిశ్రా, ముగ్గురు ఎస్ఐలు, నాలుగు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ఎదురుకాల్పులు జరిపి ముగ్గుర్ని హతమార్చాయి. మిగతావారితో కలిసి దూబే తప్పించుకుని, సమీపంలోని అడవుల్లోకి పరారయ్యాడు. అయితే, పోలీసుల దాడి గురించి గ్యాంగ్‌స్టర్‌కి ముందస్తు సమాచారం అందినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు వస్తారని తెలిసే ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ‘పోలీసులు చేరుకున్న విషయాన్ని గమనించిన క్రిమినల్స్.. వారిని ఏమార్చి రోడ్లను దిగ్బంధించారు. పోలీసులను బయటకు వెళ్లకుండా చుట్టిముట్టారు. ఈ విషయం తెలియని పోలీసులు.. నేరస్థుల వలలో చిక్కుకోవడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు’ అని డీజీపీ అన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి అడిషనల్ డీజీ, కాన్పూర్ ఐజీ, సీనియర్ ఎస్పీ, ఫోరెన్సిక్ టీమ్ అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఎస్టీఎఫ్ దళాలు కూడా రంగంలోకి దిగాయి.


By July 03, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/uttar-pradesh-police-kill-3-criminals-in-kanpur-encounter/articleshow/76764793.cms

No comments