Breaking News

యూపీ పోలీస్ ఎన్‌కౌంటర్.. పోలీసులకు చిక్కినట్టే చిక్కి చేజారిన వికాస్ దూబే


కాన్పూర్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన సూత్రధారి వికాస్ దూబే.. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఇప్పటి వరకూ అతడి అనుచరుల్లో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ముఖ్య అనుచరులతో ఫరిదాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్టు సమాచారం అందుకున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎస్టీఎఫ్, హరియాణా పోలీసులు.. అక్కడకు చేరుకునేసరికి అతడు పరారయ్యాడు. పోలీసుల రాక గురించి తెలుసుకున్న దూబే తన నలుగురు అనుచరులతో కలిసి పారిపోయాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వికాస్ దూబే దాక్కున్న ప్రదేశాన్ని మంగళవారం సాయంత్రం గుర్తించిన ఫరిదాబాద్ పోలీసులు.. యూపీ ఎస్టీఎఫ్ దళాలకు సమాచారం అందించాయి. దీంతో ఎస్టీఎఫ్ అక్కడకు చేరుకునేలోపు నిందితుడు తన నలుగురు అనుచరులతో కలిసి తప్పించుకున్నాడు. ఫరిదాబాద్‌లో దాక్కున్న వికాస్ దూబే.. ఢిల్లీ కోర్టులో లొంగిపోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులకు చిక్కితే తనను ఎన్‌కౌంటర్ చేయడం ఖాయమని భయపడుతున్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. యూపీ కోర్టు ముందు సరెండర్ అప్పీల్ గురించి భయపడుతున్న వికాస్ దూబే.. ఆ రాష్ట్రం వెలుపల కోర్టు ముందు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిపాయి. ఫరీదాబాద్ హోటల్‌‌లో దాదాపు రెండు గంటల పాటు పోలీసులు గాలించారు. నిందితుడు తమ జిల్లాలోకి ప్రవేశించకుండా గురుగ్రామ్ పోలీసులు అన్ని సరిహద్దులను మూసివేశారు. అయితే, రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని ఏదో ఒక ప్రాంతంలో దూబే ఉంటాడని భావిస్తున్నారు. దూబే ఉన్న హోటల్, ఆ చుట్టపక్కల పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను హరియాణా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఓ చోట బ్యాగ్ పట్టుకుని నిల్చున్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. అతడెవరనేదీ స్పష్టంగా గుర్తించలేకపోయామని తెలిపారు. మరిన్ని ఫుటేజ్‌లను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. మరోవైపు, అతడికి అత్యంత సన్నిహితుడైన అమర్‌ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ పట్టణంలో అమర్ దూబే తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ పోలీస్ ఫోర్స్ అతడిని చుట్టముట్టి కాల్చి చంపేశారు. పోలీసుల కాల్చివేత కేసులో అమర్ దూబే కూడా నిందితుడని, అతడిపై రూ.25వేల రివార్డు ఉన్నట్లు అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అతడిపై గతంలో నమోదైన కేసుల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు.


By July 08, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gangstar-vikas-dubey-escapes-from-faridabad-hotel-before-cops-arrive/articleshow/76846865.cms

No comments