Breaking News

కరోనాకు వ్యాక్సిన్‌పై ట్రంప్ ట్వీట్.. ఆ గ్రేట్ న్యూస్ ఇదేనా? నేడు ప్రకటన?


వ్యాక్సిన్ గురించి అమెరికా అధ్యక్షుడు బుధవారం చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘గ్రేట్ న్యూస్ ఆన్ వ్యాక్సిన్స్’ అంటూ ట్వీట్ చేసిన ట్రంప్.. వివరాలను మాత్రం వెల్లడించలేదు. వ్యాక్సిన్ ఎక్కడ అభివృద్ధి చేయబడుతుంది, ఏంటనే వివరాలను ట్రంప్ వెల్లడించకపోవడంతో దీనిపై స్పష్టత రాలేదు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను గురువారం ప్రకటించవచ్చంటూ బ్రిటన్ ఐటీవీ సంపాదకుడిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. మరోవైపు, మోడెర్నా వ్యాక్సిన్ ప్రయోగించిన కరోనా రోగులందరి శరీరంలోనూ యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ బుధవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొన్న పరిశోధకులు.. ఇప్పటి వరకూ తాము నిర్వహించిన ట్రయల్స్‌లో ప్రతినిరోధకాలను టీకా ఉత్పత్తిచేసినట్టు గుర్తించామని ఇటీవల ప్రకటించారు. ‘ఆస్ట్రాజెనెకా‌తో కలిసి ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌పై త్వరలో (బహుశా రేపు) సానుకూల వార్తలు వస్తాయని నేను విన్నాను’ అంటూ బ్రిటన్ ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్ వ్యాఖ్యానించినట్టు రాయిటర్స్ తెలిపింది. ఇప్పటికే మూడో దశలో 18ఏళ్లుపైబడి వ్యక్తులపై ప్రయోగాలు ప్రారంభించగా.. తొలి దశ ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ కట్టడికి అభివృద్ధి చేసిన టీకా.. తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో సత్ఫలితాలను ఇచ్చినట్లు అమెరికా ప్రకటించింది. త్వరలోనే తదుపరి దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, మోడెర్నా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. తొలి దశలో మార్చి నుంచి 45 మంది వాలంటీర్ల మీద ఈ టీకాను పరీక్షించామని పరిశోధకులు తెలిపారు. వారిలో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు కరోనా వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు విడుదలయ్యాయని, అవి కరోనా నుంచి కోలుకున్నవారిలో కనిపించే స్థాయిలో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు సగం మందిలో అలసట, తలనొప్పి, చలి, జ్వరం, టీకా వేసిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని, ఇవి ఇతర టీకాల వాడకంలోనూ సాధారణమే అని పేర్కొన్నారు. ఈ ప్రయోగ వివరాలను ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురించారు. జులై 27 తర్వాత తదుపరి దశ ప్రయోగాలను 30 వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నట్లు మోడెర్నా తెలిపింది.


By July 16, 2020 at 07:41AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-president-donald-trumps-great-news-on-vaccines-tweet-is-short-on-details/articleshow/76990521.cms

No comments