వాడ్ని ఎన్‌కౌంటర్ చేయండి.. ఉత్తరప్రదేశ్ గ్యాంగస్టర్ దూబే తల్లి
ఉత్తరప్రదేశ్‌లో పోలీసులపై క్రిమినల్స్ కాల్పులకు పాల్పడిన ఘటనలో డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్యాంగస్టర్ వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై అతడి అనుచరులు మాటువేసి కాల్పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో నిందితుడు వికాస్ దూబే తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడిని కూడా ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేయాల్సిందని వికాస్ దూబే తల్లి సరళా దేవి అన్నారు. లక్నోలోని మరో కుమారుడు దీప్ ప్రకాశ్ దూబే వద్ద ఉంటున్న సరళా దేవి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, ఎన్‌కౌంటర్ చేసి వికాస్ దూబేను చంపినా తాను బాధపడేదాన్ని కాదని అన్నారు. చివరిసారిగా ఏప్రిల్‌లోనే వికాస్ తనను కలిశాడని, ఆ తర్వాత ఎప్పుడూ చూడటానికి రాలేదని తెలిపారు. లక్నోలోని కృష్టానగర్ ఇంద్రలోక్ కాలనీలో తన చిన్న కుమారుడు, కోడలు అంజలి, మనవళ్లు గంగన్, రామ్‌తో కలిసి సరళా దేవి ఉంటున్నారు. అంతేకాదు, శుక్రవారం ఉదయం 8 గంటలకు గుడికి వెళ్లిన దీప్ ప్రకాశ్ కూడా ఇప్పటి వరకూ ఇంటికి రాలేదన్నారు. దీప్ ప్రకాశ్ భార్య అంజలి దూబే చౌబేపూర్ గ్రామ సర్పంచ్‌గా ఉంది. వికాస్ తండ్రి స్వగ్రామం బిక్రూలోనే ఉంటుండగా.. అతడు పక్షవాతంతో బాధపడుతున్నాడు. వికాస్ భార్య సోనమ్, పిల్లలు ఆకాశ్, శంతన్ కూడా అక్కడే ఉంటున్నారు. ఘటన జరిగిన తర్వాత కృష్టానగర్, అలంబాగ్, సరోజినగర్ మూడు పోలీస్‌స్టేషన్ల పోలీసులు బృందాలుగా ఏర్పడి.. గ్యాంగ్‌స్టర్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌గా ఉన్న అంజలి, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీప్ ప్రకాశ్ కోసం మరో బృందం గాలిస్తోంది.
By July 04, 2020 at 11:21AM
No comments