Breaking News

దేశంలో ఉప్పెనలా కరోనా వైరస్: నిన్న ఒక్క రోజే దాదాపు 50వేల కొత్త కేసులు!


దేశవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. శుక్రవారం దాదాపు 50వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మరో 775 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 13.37 లక్షలకు చేరుకోగా.. మరణాల సంఖ్య 31,406కి చేరింది. ఇప్పటి వరకూ 8.50 లక్షల మంది బాధితులు కోలుకోగా.. మరో 4.50 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసుల సంఖ్య 3.50 లక్షలు దాటేయగా.. మరణాలు 13,132గా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రికార్డుస్థాయిలో కేసులు నమోదుకావడం గమనార్హం. మహారాష్ట్ర ఎప్పటిలాగా 9,615 కేసులతో తొలిస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 8,147 కేసులతో రెండో స్థానంలో ఉంది. గడచిన వారం రోజులుగా మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. తమిళనాడులో 6,785, కర్ణాటకలో 5,007, ఉత్తరప్రదేశ్‌లో 2,667 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గుజరాత్‌లో పాజిటివ్ కేసులు 50వేల మార్క్ దాటింది. దేశంలో ఆదివారం కరోనా కేసులు 40వేల మార్క్ దాటగా.. అప్పటి నుంచి ఆ సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 50వేల మార్క్‌‌కు చేరువయ్యింది. మరణాల రేటు కూడా ఇలాగే పెరుగోతంది. గురువారం తొలిసారి కోవిడ్ మరణాలు దేశంలో 700 దాటగా.. శుక్రవారం కూడా అధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. జులై నెల ప్రారంభం నుంచి కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. జులై తొలి నాలుగు రోజుల్లో 22,366 కేసులు సగటున నమోదుకాగా.. గత నాలుగు రోజులుగా ఇది 45,500గా ఉంది. జులై 1-4, 19-23 మధ్య వైరస్ ఎక్కువగా ఉన్న 22 రాష్ట్రాలలోని 20లో రోజువారీ కేసులు కనీసం 30% పెరిగాయి. ఇది దేశవ్యాప్తంగా మహమ్మారి పెరుగుతుందనడానికి సంకేతం. ఇక, రాజధాని ఢిల్లీలో కేసులు గణనీయంగా తగ్గాయి. రోజువారీ కేసులు 53 శాతం తగ్గింది. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మొత్తం 1640 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కు చేరింది.


By July 25, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-new-cases-surge-to-49000-deaths-to-757-in-india/articleshow/77161618.cms

No comments