Breaking News

కార్గిల్ విజయ్ దివస్: దాయాదిని తరిమి తరిమి కొట్టిన ఆ విజయానికి 21ఏళ్లు


మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్ దుష్టపన్నాగానికి తెరతీయగా.. దీనికి భారత్ సైనికులు సింహాల్లా వారిపై లంఘించి దాయాదికి తగిన గుణపాఠం చెప్పి నేటికి 21 ఏళ్లు. ఉగ్రమూకల సాయంతో కుతంత్రాలకు తెరతీసిన పాక్..‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ ధాటికి దాయాది తోక ముడిచింది. ఉగ్రవాదులతో కలిసి కశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జూలై 26న జరుపుకొంటున్నాం. కార్గిల్ యుద్ధం... దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాదిపై మన సైన్యం సాధించిన విజయం అనన్యసామాన్యం. హిమాలయ పర్వతాల్లోని ఘర్‌కోం అనే గ్రామంలో తషీ నామ్‌గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ భారత్-పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు. అక్కడ చాలామంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకున్న తషీ వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కెప్టెన్‌ సౌరభ్‌ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా పాక్‌ సైన్యం వారిని బంధించి తీసుకుపోయి చిత్రహింసలకు గురిచేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి పడిన తొలి అడుగు ఈ ఘటన. భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి హియాలయ పర్వత శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. సముద్ర మట్టానికి 14-18వేల అడుగుల ఎత్తులో ఉండే ఆ ప్రదేశంలో ఉండే అత్యంత శీతల వాతావరణం మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉండదు. దీంతో ఆ కాలంలో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం. అయితే 1999లో ఈ పరిస్థితిని అనుకూలంగా చేసుకుని భారత్‌ను దెబ్బతీయాలని కుట్రకు తెరతీసింది. ఆ ఏడాది కూడా శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్ , తుర్‌తుక్ సబ్ సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలగడంతో పాక్ తన కుట్రను అమలుచేసింది. దాయాది సైన్యం భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. 1999 ఫిబ్రవరిలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ, పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లు రెండు దేశాల మధ్య శాంతి కోసం ‘లాహోర్‌ ప్రకటన’ చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్‌ ఈ కుట్రకు తెరదీశారు. కార్గిల్‌లో 1999 మే-జూలై నెలల మధ్య ఈ యుద్ధం జరిగింది. నాటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఆర్మీ చీఫ్ నవాజ్ షరీఫ్ భారత్‌తో యుద్ధానికి దిగాడు. ఎత్తయిన మంచు కొండ ప్రాంతాల్లో ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత ఆర్మీపైకి దాడి ప్రారంభించారు. శత్రువులు ఎత్తులో ఉండటం వారికి అనుకూలంగా మారింది. దిగువన ఉండటం ప్రతికూలంగా మారడంతో.. భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాడారు. కొండల పైకి ఎక్కి టైగర్ హిల్, టోలోలిగ్ కొండలపై మకాం వేసిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు. పాకిస్థాన్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ మరింతగా రెచ్చిపోయింది. యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాక్.. జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు సరికదా.. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలు వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు. కార్గిల్ నుంచి పాక్ బలగాలు వెనుదిరగడంతో.. భారత సైన్యం మిగతా ఔట్ పోస్టుల్లోని పాకిస్థాన్ సైన్యాన్ని తరిమి కొట్టింది. జులై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగింది. సుమారు 73 రోజలపాటు సాగిన యుద్ధం అధికారిక లెక్కల ప్రకారం 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. దాయాది సైన్యానికి కోలుకోలేని దెబ్బతగిలింది.


By July 26, 2020 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-celebrates-21st-anniversary-of-kargil-vijay-diwas/articleshow/77177797.cms

No comments