ఇరాన్: ఆస్పత్రిలో గ్యాస్ లీక్‌తో పేలుడు.. 19 మంది సజీవదహనం
ఇరాన్ రాజధాని ట్రెహాన్‌లోని ఓ హాస్పిటల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుని 19 మంది సజీవదహనమయ్యారు. ఉత్తర టెహ్రాన్‌లోని ఓ క్లినిక్‌లో గ్యాస్ లీకయి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. సినా అథర్ మెడికల్ సెంటర్‌లో మంగళవారం రాత్రి గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం జరిగినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ప్రమాదంలో తొలుత 13 మంది చనిపోయినట్టు భావించినా.. సహాయక చర్యల అనంతరం మరో ఆరు మృతదేహాలను గుర్తించినట్టు టెహ్రాన్ ఫైర్ విభాగం అధికార ప్రతినిధి జలాల్ మాలేకీ వెల్లడించారు. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారని వివరించారు. ఇరాన్ అధికారిక మీడియా మాత్రం 15 మంది చనిపోయినట్టు ప్రకటించింది. హాస్పిటల్ సెల్లార్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ల లీకయి మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించాయని ఆయన తెలిపారు. పై అంతస్తుల్లోని ఆపరేషన్ థియేటర్స్‌లో కొంత మంది రోగులు, సిబ్బంది ఉన్నారని, మంటలు వ్యాపించి, దట్టమైన పొగతో వీరంతా ఊపిరాడక చనిపోయారని కొందరు బాధితులు తెలియజేశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, సమీపంలోని తాజ్‌రిష్ బజార్ ప్రాంతం నుంచి జనం భారీగా తరలిరావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించామని అన్నారు.
By July 01, 2020 at 08:13AM
No comments