Breaking News

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ‘టైమ్ ఫర్ నేచర్’


మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవుతుంది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వల్ల పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించింది. పరిశ్రమలు, వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్రహాన్ని మరింత వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయి. భూతాపం పెరగడంవల్ల పర్యావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్‌తో ఓజోన్ పొర దెబ్బతింటోంది. వాతావరణ మార్పులు, శిలాజ ఇంధనాల వాడకంపైనా గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా యువతరం పెద్ద ఎత్తున ఆందోళన చేసి దేశాధినేతలనే నిలదీశారు. ప్రకృతే వారికి సమాధానం చెప్పిందా అన్నట్లుంది నేటి పరిస్థితి. ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. దీంతో పలు దేశాలలో లాక్‌డౌన్‌ వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గాయి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్పత్తీ, బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడింది. భారతీయులకు పవిత్రమైన గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమైపోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. గంగానదిని శుభ్రం చేయాలంటూ ఎందరో ఆందోళనలు చేస్తూసే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. అలాంటిది లాక్‌డౌన్‌‌తో ఫ్యాక్టరీల మూసివేయడం వల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందాలను సంతరించుకుంది. ఇక, తొలిసారిగా 1972లో నిర్వహించారు. ఆ తర్వాత 1974లో ‘ఒకే ఒక్క భూమి’ థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా ప్రతిసారీ ఒక్కో థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ‘టైమ్ ఫర్ నేచర్’ థీమ్‌ను ఎంపిక చేసి.. జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహిస్తున్నారు. అక్కడే ఎందుకు నిర్వహిస్తున్నారంటే భూమిపై ఉన్న జీవవైవిధ్యంలో 10 శాతం కొలంబియాలోనే ఉండటం విశిష్టత. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో భాగం కావడం వల్ల అది సాధ్యమైంది. పక్షులు, ఆర్చిడ్స్ బయోడైవర్సిటీ కేటగిరిలో కొలంబియా తొలి స్థానంలో ఉంది. మొక్కలు, సీతాకోకచిలుకలు, స్వచ్ఛమైన నీటిలో లభించే చేపలు, ఉభయచరాల్లో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేశాయి. గతేడాది బ్రెజిల్‌ అమేజాన్‌ అడవుల్లో, ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చుతో అనేక జీవుల మనుగడకు ముప్పు వాటిల్లింది. జంతువులు తమను రక్షించుకునేందుకు రోడ్లపైకి వచ్చాయి. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పట్టణాల విస్తీర్ణం పెరగడంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జంతువులకు తిండి దొరక్క జనాల్లోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణంపై ప్ర భావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని, ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.


By June 05, 2020 at 08:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/enviroment-day-date-theme-history-and-significance-of-world-environment-day-2020/articleshow/76206500.cms

No comments