సరిహద్దుల్లో భారత గూఢచర్య డ్రోన్ కూల్చేశాం.. పాక్ సైన్యం ప్రకటన
కశ్మీర్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)ను దాటి తమ భూభాగంలోకి ప్రవేశించిన భారత గూఢచర్య డ్రోన్‌ను కూల్చివేశామని పాకిస్థాన్ సైన్యం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. నాలుగు రోటార్లతో కూడిన డ్రోన్ (క్వాడ్‌కాప్టర్) కశ్మీర్ వద్ద హాట్ స్ప్రింగ్ సెక్టార్‌లో తమ భూభాగంలోకి 850 మీటర్ల మేర దూసుకొచ్చిందని వెల్లడించింది. తాజాగా డ్రోన్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు భారత్‌కు చెందిన 9 క్వాడ్‌కాప్టర్లను కూల్చివేశామని తెలిపింది. అయితే, పాక్ సైన్యం గతంలో చేసిన ఇలాంటి ప్రకటనలను భారత్ ఖండించడం గమనార్హం. పాక్ సైన్యం తాజా ప్రకటనపై భారత్ ఇంత వరకూ స్పందించలేదు. పది రోజుల కిందట పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ప్రయత్నించగా.. దాని ప్రయత్నాలు భారత సైనికులు తిప్పికొట్టారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆయుధాలు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న పాకిస్థాన్ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. శనివారం తెల్లవారుజామున 5:10 గంటల ప్రాంతంలో రథువా గ్రామంలోని పన్సార్ బోర్డర్ ఔట్ పోస్ట్ వద్ద డ్రోన్ కదలికలు గుర్తించిన భారత సైన్యం.. దాన్ని కూల్చివేసింది. మొత్తం 8 రౌండ్లు కాల్పులు జరిపి.. భారత భూభాగంలో 250 మీటర్ల లోపల దాన్ని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. చైనాలో తయారుచేసిన ఈ డ్రోన్‌లో అత్యాధునిక రైఫిల్, 60 రౌండ్ల బుల్లెట్లు, ఏడు చైనా గ్రనేడ్లు, 2 జీపీఎస్‌లను గుర్తించారు. పాక్ ఏజెంట్లకు సరఫరా చేసేందుకు వీటిని డ్రోన్‌లో తరలించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఓవైపు సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. మరోవైపు, దాయాది పాక్ సైతం కయ్యానికి కాలుదువ్వుతోంది. గతేడాది ఆగస్టు తర్వాత భారత్, పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేయడంతో పాకిస్థాన్ మరింత ఆక్రోశంతో రగిలిపోతోంది. అప్పటి నుంచి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.
By June 29, 2020 at 08:07AM
No comments