Breaking News

విజయవాడ గ్యాంగ్ వార్‌లో కొత్త కోణం.. పండు ఫ్యామిలీ న్యూస్టోరీ


విజయవాడ గ్యాంగ్ వార్‌లో మరో కొత్త కోణాన్ని పండు కుటుంబసభ్యులు వినిపిస్తున్నారు. పండు కుటుంబసభ్యుల కొత్త కథనం విని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. పండుని హత్య చేయడానికి సందీప్ అనుచరులు ఇంటిపై దాడికి పాల్పడ్డారని, ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి పండుకి రూ.15వేలు ఇవ్వాల్సి ఉందని, వాటిని వసూలుచేయడానికే అక్కడకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలోనే‌ సందీప్ పెనమలూరు లాండ్ సెటిల్మెంట్ చేస్తున్నట్టు వివరించారు. ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు పండు వచ్చి‌ కుర్చోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సందీప్.. తన అనుచరులతో ఇంటికి వచ్చి బెదిరించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాతే సందీప్ షాపు దగ్గరకు వెళ్లి పండు కత్తులతో‌ బెదిరించినట్టు తెలిపారు. ఆ మర్నాడే మాట్లాడుకుందామని పిలిచి పండు హత్యకు సందీప్ ప్లాన్ చేశాడని ఆరోపించారు. సందీప్ పిలవడంతో పడమట వెళ్లిన పండుపై ప్లాన్ ప్రకారం అతడి అనుచరులు దాడి చేశారని, ఆ ఘర్షణలోనే సందీప్ కత్తిపోట్లకు గురై మృతిచెందాడని అంటున్నారు. కాగా, ఈ కేసులో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. మృతుడు సందీప్ గ్రూప్ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. స్ట్రీట్ ఫైట్‌కి ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని ఇప్పటికే పోలీసులు తేల్చారు. వివాదానికి కారణమైన స్థలం యజమానులు ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డితో పాటు సెటిల్‌మెంట్ బాధ్యత తీసుకొన్న నాగబాబును కూడా పోలీసులు విచారిస్తున్నారు. సందీప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పండు గ్యాంగ్‌లోని 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కి పంపారు. ఇక, తన భర్తను పథకం ప్రకారమే హత్య చేశారని తోట సందీప్ భార్య తేజస్విని మరోసారి ఆరోపించారు. నగర పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్ తర్వాత కూడా ఇదే విషయాన్ని ఆమె బలంగా చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. హత్య జరిగిన ప్రాంతంలో షూట్ చేసిన వీడియోలను ఎడిట్ చేశారని తేజస్విని ఆరోపిస్తున్నారు. మొత్తం వీడియోలను బయటపెడితే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆమె తేల్చిచెబుతున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని తేజస్విని అంటున్నారు. మనిషిని చంపేంత స్థాయిలో ల్యాండ్ సెటిల్ మెంట్లు ఉండవని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


By June 07, 2020 at 10:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-twist-in-vijayawada-gang-war-pandu-family-tells-new-story/articleshow/76242110.cms

No comments