Breaking News

సరిహద్దుల్లో ఉద్రిక్తత: భారత్, చైనా చర్చలపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన


సరిహద్దు వివాదాలను సైనిక, దౌత్య మార్గాల్లో పరస్పర సంప్రదింపులు, చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌-చైనా సైన్యాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయించారు. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నెల రోజులుగా కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడానికి శనివారం కీలక ముందడుగు పడింది. ఇరు దేశాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య లడఖ్‌లోని చైనా వైపు మాల్దోలో ఉన్న సరిహద్దు సిబ్బంది సమావేశ ప్రాంతంలో ఈ భేటీ జరిగింది. భారత్ తరఫున లేహ్‌ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరిందర్‌ సింగ్‌, చైనా బృందానికి టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ లియు లిన్ నేతృత్వం వహించారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని, సమస్య పరిష్కారానికి పరస్పర సంప్రదింపులు కొనసాగించాలన్న అభిప్రాయానికి ఇరుపక్షాలు వచ్చాయని భారతసైనిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్-చైనాల మధ్య సైనిక చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపింది. ద్వైపాక్షిక సమస్యల పరిష్కారానికి శాంతియుత చర్చలకు అంగీకరించాయని తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాల కోసం సరిహద్దుల్లో శాంతినెలకొల్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. గాల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు వద్ద యథతథస్థితిని నెలకొల్పాలని భారత్ డిమాండ్‌ చేసింది. ఆ ప్రాంతాల్లో చైనా సైనికుల భారీ మోహరింపులను వ్యతిరేకించినట్లు తెలిసింది. ఎల్‌ఏసీలోని మన దేశం వైపునున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చైనా అడ్డుకోరాదని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. లడఖ్‌లోని సరిహద్దు ప్రతిష్టంభనపై శుక్రవారం రెండు దేశాల దౌత్య అధికారుల మధ్య సంప్రదింపులు జరిగాయి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న అవగాహనకు వచ్చారు. అంతకుముందు ఇదే అంశంపై స్థానిక సైనిక కమాండర్‌ స్థాయిలో 12 దఫాలు, మేజర్‌ జనరల్‌ అధికారుల స్థాయిలో మూడు సార్లు చర్చలు జరిగినా ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది.


By June 07, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/talks-between-senior-army-officers-of-india-and-china-end-with-positive-trajectory-say-mea/articleshow/76241902.cms

No comments