Breaking News

దేశంలో కరోనా: 85% కేసులు, 87 శాతం మరణాలు ఆ 8 రాష్ట్రాల్లోనే!


దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడం ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం ఒక్కరోజే 20వేలకిపైగా కేసులు నమోదు కావడంతో దేశంలో కేసుల సంఖ్య 5.29 లక్షల దాటేయగా.. మరణాల సంఖ్య 16,106కు చేరాయి. ఈ పరిస్థితుల్లో దేశంలో కరోనా తీవ్రతపై కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్దన్‌ నేతృత్వంలోని మంత్రుల ప్రత్యేక బృందం 17వ సారి శనివారం సమావేశమై కట్టడి చర్యలపై సమీక్షించింది. అనంతరం కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 85.5 శాతం, ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 87% కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ ,తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయని ాయన తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1.57లక్షల కేసులు, 7,273 మరణాలు నమోదు కాగా.. ఢిల్లీలో 80,180 కేసులు, 2,588 మరణాలు; తమిళనాడులో 78,335 కేసులు, 1.025 మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దేశంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. అలాగే, గుజరాత్‌లో 30వేల మందికి వైరస్ సోకగా.. యూపీలో 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 310,146 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 58.13 శాతంగా నమోదైంది. అలాగే, 16,106 మంది మృతిచెందడంతో మరణాల రేటు దాదాపు 3శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 2.03 లక్షల మంది బాధితులు చికిత్సపొందుతున్నారు. గత రెండు వారాలుగా దేశంలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రాలకు సాంకేతికంగా సహాయం అందజేయడానికి వైద్య, అంటువ్యాధుల నిపుణులు, ఇతర ప్రత్యేక అధికారులతో కూడిన 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇప్పటికే మరోసారి కేంద్ర బృందం గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. కేంద్రమంత్రి హర్షవర్దన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జైశంకర్‌, హర్దీప్‌సింగ్‌ పూరీ, అశ్వినికుమార్‌ చౌబీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన గణాంకాలను ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ భార్గవ వివరించారు. గడచిన 24 గంటల్లో 2,20,479 నమూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 79,96,707కి చేరాయి.


By June 28, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/8-states-make-up-85-of-coronavirus-caseload-87-of-total-deaths-says-health-ministry/articleshow/76669481.cms

No comments