రూ.5లక్షల నగదు సహా ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. సిద్దిపేటలో కలకలం
ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలు ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన ఘటన తెలంగాణలోని జిల్లా ప్రజ్ఞాపూర్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ వద్ద జగదేవపూర్ వెళ్లే దారిలో ఇండియా వన్ ఏటీఎం ఉంది. శనివారం రాత్రి దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించి గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి యాజమానికి ఏటీఎం కన్పించకపోవటంతో నిర్వాహకుడు నాగరాజుకు సమాచారమిచ్చాడు. అయితే తన భార్యకు అనారోగ్యంగా ఉందని చెప్పిన ఆయన సోమవారం తీరిగ్గా అక్కడికి వచ్చి గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో గజ్వేల్ ఏసీపీ నారాయణ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చోరీకి గురైన సమయంలో ఏటీఎంలో రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేటకు చెందిన క్లూస్ టీం ఘటనా స్థలంలో అధారాలు సేకరించింది. ఏటీఎంను ఎత్తుకెళ్లేందుకు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం పగటిపూట రెక్కీ నిర్వహించి శనివారం రాత్రి చోరీకి పాల్పడినట్లు పేర్కొంటున్నారు. Also Read: ఏటీఎంలోకి వెళ్లగానే దుండగులు ముందుగా సీసీ కెమెరాల తీగలు కత్తిరించడంతో ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డు కాలేదు. అయితే రాజీవ్ రహదారిపైనున్న పలు సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు నమోదైనట్లు సమాచారం. ఆ పుటేజీ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఏటీఎం కనిపించడం లేదని ఆదివారం ఇంటి యజమాని సమాచారమిచ్చినా నిర్వాహకులు నాగరాజు వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ చోరీ జరగడంతో గమనార్హం. Also Read:
By June 30, 2020 at 07:24AM
No comments