Breaking News

దేశంలో కరోనా విశ్వరూపం.. ఆరు రోజుల్లో 1.10 లక్షల కేసులు


దేశంలో విశ్వరూపం దాల్చింది. కేవలం ఆరు రోజుల్లోనే 1.10 లక్షల పాజిటివ్ కేసులు నమోదయిన తీరు వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది. గత నెల రోజుల నుంచి పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం మరో 19,700 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. దేశంలో మరో 384 మంది కరోనాకు బలయ్యారు. ముందు రోజు శనివారంతో పోల్చితే ఆదివారం పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 549,107కి చేరగా.. మరణాలు 16,468గా నమోదయ్యాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య ఆశాజనకంగా ఉంది. ఇప్పటి వరకూ 3.2 లక్షల మంది కోలుకోగా.. 2.1 లక్షల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మహారాష్ట్రలో అత్యధికంగా 5,000కుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే పాజిటివ్ కేసులు తక్కువగా నమోదుకావడం సానుకూలంశం. అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 164,626కి చేరాయి. దేశంలోని మొత్తం కేసుల్లో 30 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆదివారం మరో 156 మంది ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు 7,429కి చేరాయి. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో వరుసగా మూడో రోజు పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 4వేలకు దగ్గరగా నమోదయ్యాయి. దీని తర్వాత ఢిల్లీలోనూ 2,889 కేసులు నమోదయ్యాయి. తొలిసారిగా కర్ణాటకలో 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. ఆదివారం కర్ణాటకలో 1,267 కొత్త కేసులు నమోదు కాగా.. ఇందులో 783 బెంగళూరు నగరంలోనే ఉన్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒకే రోజు 20వేలకుపైగా కేసులు నమోదయిన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఇక, ముంబయి నగరంలో గడచిన మూడు రోజుల నుంచి పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గుజరాత్‌లో 624, పశ్చిమ్ బెంగాల్ 572 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో బెంగాల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 17,283కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 813 మంది కరోనా బారిన పడ్డారు. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు రావడం, మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కొత్తగా వైరస్‌ సోకిన వారిలో 755 మంది రాష్ట్రంలోనే ఉంటున్న వారు కాగా, 50 మంది ఇతర రాష్ట్రాలు, 8 మంది విదేశాల నుంచి వచ్చినవారు. తెలంగాణలోనూ కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా మరో 983 పాజిటివ్‌లు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలోనే అత్యధికంగా 816 కేసులు నిర్ధారణ కాగా, రంగారెడ్డి 47, మంచిర్యాల 33, మేడ్చల్‌ 29, వరంగల్‌ గ్రామీణ 19, వరంగల్‌ నగర 12, భద్రాద్రి కొత్తగూడెం 5 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 14,419కు పెరిగింది.


By June 29, 2020 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-1-1-lakh-covid-cases-in-6-days-19700-on-sunday-in-india/articleshow/76681261.cms

No comments