సిక్కింను ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రకటన.. చెలరేగిన దుమారం!
పౌర రక్షణ కార్యకర్తల పోస్టుల నియామకానికి నియామకానికి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసిన ఢిల్లీ ప్రభుత్వం.. అందులో సిక్కింను నేపాల్, భూటాన్‌ల మాదిరి ప్రత్యేక దేశంగా పేర్కొంది. దీంతో వివాదం మొదలైంది. ఢిల్లీలోని ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పించగా.. సైతం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసిన సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ గుప్తా.. ఇది ఘోర తప్పిందమని, తక్షణమే దానిని ఉససంహరించాలని కోరారు. అంతేకాదు, సిక్కిం ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. దేశంలోనే 22 వ రాష్ట్రంగా 1975 మే 16న అవతరించిన సిక్కిం రాష్ట్రంలోని ప్రజలు తాము భారతదేశ పౌరులమని చాలా గర్వంగా చెప్పుకుంటారని పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రకటనను ఉపసంహరించుకోవాలని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సైతం ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లో జరిగిన తప్పిదానికి కారణమైన సీనియర్ అధికారిపై కేజ్రీవాల్ ప్రభుత్వం సస్పెషన్ వేటు వేసింది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘నోటిఫికేషన్‌లో తప్పిదానికి కారణమైన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారిని విధులు నుంచి తక్షణమే తప్పించాం.. సిక్కింను పొరుగుదేశాలతో ప్రత్యేక దేశంగా పోల్చి భారత ప్రాదేశిక సమగ్రతను కించపరిచేలా వ్యవహరించారు’ అని ట్విట్టర్‌లో తెలిపారు. మరోవైపు, ఈ వ్యవహారంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. భారత్‌లో సిక్కిం అంతర్భాగమని, ఇలాంటి విషయాలలో తప్పులను సహించబోమని స్పష్టం చేశారు. ఉద్యోగ నియమాకాల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరిస్తామని పేర్కొన్నారు.
By May 24, 2020 at 12:30PM
No comments