Breaking News

నేటి నుంచే విమాన ప్రయాణాలు షురూ.. ఏపీలో మాత్రం బుధవారం ప్రారంభం


మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా నిలిచిపోగా.. క్రమంగా దీనిని పునరుద్దరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రారంభించగా.. సోమవారం నుంచి విమానాలు ఎగరనున్నాయి. రెండు నెలలు ఆగిపోయిన విమానాలు ఎట్టకేలకు తిరిగి నింగిలోకి ఎగరబోతున్నాయి. దేశీయ విమానయాన సేవలు సోమవారం నుంచి పరిమితంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం నుంచి 30 విమానాలు రాకపోకలు సాగించనుండగా.. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో మాత్రం కొంత జాప్యం చోటుచేసుకోనుంది. ఏపీలో బుధవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. మరోవైపు, విమాన ప్రయాణికులను క్వారంటైన్‌ నిబంధనలపై పలు రాష్ట్రాలు విడుదల చేసిన మార్గదర్శకాలు వేర్వేరుగా ఉండటంతో గందరగోళం నెలకుంది. కరోనా మహమ్మారి తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో విమాన సేవలను మరికొన్నాళ్లు నిలిపివేయాలని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆదివారం ఆయా రాష్ట్రాలతో ముమ్మర చర్చలు జరిపి ఒప్పించింది. అంపన్‌ తుఫాను తీవ్రతకు కుదేలైన పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి పునఃప్రారంభమవుతాయని విమానయాన శాఖ మంత్రి తెలిపారు. చెన్నైకి ఇతర ప్రాంతాల నుంచి గరిష్ఠంగా 25 విమానాలే వెళ్తాయని, అక్కడి నుంచి బయలుదేరే విమానాలపై మాత్రం పరిమితి లేదని పేర్కొన్నారు. ముంబయి విమానాశ్రయంలో సోమవారం 50 విమాన సర్వీసులే నడుస్తాయి. మహారాష్ట్రలోని మిగతా విమానాశ్రయాలు లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే మూడో వంతు సామర్థ్యంతో పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ విన్నపం మేరకు మంగళవారం నుంచి ఆ రాష్ట్రంలో సర్వీసులు ప్రారంభించనున్నట్లు మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే 20% సామర్థ్యంతోనే విజయవాడ, వైజాగ్‌ విమానాశ్రయాలు నడుస్తాయన్నారు. అయితే తగినన్ని బుకింగ్‌లు లేని కారణంగా మంగళవారం కూడా ఏపీకి సర్వీసులు నడపడం లేదని, బుధవారం ప్రారంభమవుతాయని రాష్ట్ర విమనాశ్రయాల అభివృద్ధి సంస్థ సలహాదారు భరత్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. తమ రాష్ట్రాలకు చేరుకునే విమాన ప్రయాణికులకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్‌ సహా పలు రాష్ట్రాలు సొంతంగా క్వారంటైన్‌ నిబంధనలను ప్రకటించాయి. ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి. ప్రయాణికులంతా 14 రోజులపాటు ఇంటికే పరిమితమవ్వాలని కేరళ, పంజాబ్‌ నిర్దేశించాయి. తమ రాష్ట్రానికి వచ్చేవారిని స్వీయ చెల్లింపు క్వారంటైన్‌లో రెండు వారాలపాటు ఉంచుతామని బిహార్‌ తెలిపింది. ప్రయాణికులకు 14 రోజులు అడ్మినిస్ట్రేటివ్‌ క్వారంటైన్‌ తప్పనిసరి అని జమ్మూ-కశ్మీర్‌ పేర్కొంది. తమ రాష్ట్రానికి వచ్చేవారు 7 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో, మరో 7 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని అసోం స్పష్టం చేసింది. కోవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజులపాటు ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉండాలని, తర్వాత మరో ఏడు రోజులు ఇంటికే పరిమితమవ్వాల్సి ఉంటుందని కర్ణాటక తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.


By May 25, 2020 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/domestic-flights-starts-from-today-onwords-only-asymtomatic-passengers-can-fly-says-govt/articleshow/75961418.cms

No comments